సుంకం కోతతో బంగారం స్మగ్లింగ్‌కు చెక్‌!

25 Feb, 2021 19:48 IST|Sakshi

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనాలు

గ్రే మార్కెట్‌పై కోవిడ్‌–19 ఎఫెక్ట్‌

ముంబై: బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్‌) తగ్గే వీలున్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. కస్టమ్స్‌ తగ్గింపునకు తోడు డిమాండ్‌ బలపడుతుండటంతో స్మగ్లింగ్‌కు కొంతమేర చెక్‌ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే.

బడ్జెట్‌లో చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం గోల్డ్‌ బార్‌లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీతోపాటు, వ్యవసాయ, ఇన్‌ఫ్రా సెస్, సామాజిక సంక్షేమ సర్‌చార్జీ కలగలిసి 10.75 శాతానికి చేరాయి. ఇవి బడ్జెట్‌కు ముందు 12.87 శాతంగా అమలయ్యేవి. వీటికి 3 శాతం జీఎస్‌టీ జత కలవనుంది. దీంతో 14.07 శాతానికి చేరే వీలుంది. అంతక్రితం 16.26 శాతంగా అమలయ్యేది. దేశీ గోల్డ్‌ మార్కెట్‌పై బడ్జెట్‌ ప్రభావం పేరుతో డబ్ల్యూజీసీ ప్రకటించిన నివేదిక ఇంకా ఇలా పేర్కొంది..

80 శాతం డౌన్‌
2020లో పసిడి అనధికార దిగుమతులు 80 శాతం పడిపోయి 20–25 టన్నులకు పరిమితమయ్యాయి. ఇందుకు కోవిడ్‌–19 కారణంగా లాజిస్టిక్స్‌ తదితర అవాంతరాలు ఎదురుకావడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021)లోనూ విమానయానంపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు, కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు దీనికి జత కలవనున్నాయి. వెరసి పసిడిలో అధికారిక దిగుమతులు పుంజుకునే వీలుంది. కాగా.. పసిడిపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చదవండి:
స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్‌: ధర ఎంతంటే..

మరిన్ని వార్తలు