హైదరాబాద్‌లో గృహ విక్రయాలు భేష్‌

31 Jan, 2023 05:03 IST|Sakshi

విక్రయంకాని గృహాల సంఖ్య డిసెంబర్‌ చివరకు 10 శాతం డౌన్‌

క్యూ2 నాటికి 93,473 యూనిట్లు

క్యూ3 ముగిసే నాటికి 84,545 యూనిట్లకు తగ్గుదల

ప్రోప్‌ఈక్విటీ నివేదిక

న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో డిసెంబర్‌ క్వార్టర్‌ (క్యూ3) ముగిసే నాటికి (2022 అక్టోబర్‌–డిసెంబర్‌) దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయంకాని హౌసింగ్‌ స్టాక్‌లు 10 శాతం తగ్గి 4,61,600 యూనిట్లకు పడిపోయాయని ప్రోప్‌ఈక్విటీ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2–జూలై–సెప్టెంబర్‌) ఈ సంఖ్య 5,12,526 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్‌ విషయానికి వస్తే, దేశ సగటుతో సమానంగా (10 శాతం) విక్రయంకాని గృహాల సంఖ్య క్యూ2, క్యూ3ల్లో 93,473 యూనిట్ల నుంచి 84,545కు తగ్గింది.  నివేదికలో కొన్ని అంశాలను పరిశీలిస్తే..
► తొమ్మిది నగరాల్లో హౌసింగ్‌ విక్రయాల సంఖ్య అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 1,20,275 యూనిట్లు. సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య 8 శాతం అధికంకాగా, 2021 ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అధికం.  
► రియల్‌ ఎస్టేట్‌ గణాంకాల విశ్లేషణ సంస్థ–  ప్రోప్‌ఈక్విటీ తాజా డేటా కోసం పరిగణనలోకి తీసుకున్న గృహాల్లో అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ ఫ్లోర్లు విల్లాలు/గృహాలు ఉన్నాయి. హోల్డ్‌లో (నిలిచిపోయిన) ఉన్న అమ్మకాలు, నిర్మాణాల నిలిపివేత, లాటరీ ప్రాజెక్ట్‌లను ఈ గణాంకాల నుంచి మినహాయించడం జరిగింది.  

సవాళ్లు ఉన్నా... పటిష్ట రికవరీ
అనేక సవాళ్లు ఉన్నప్పటికీ...ఈ ఏడాది గృహాల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్, పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతుండటం గమనార్హం. వడ్డీరేట్లు స్థిరంగా పెరిగినప్పటికీ, కస్టమర్లు రుణాలు తీసుకోడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్తుల ధర మున్ముందు పెరుగుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం.  
– సమీర్‌ జసుజా, ప్రోప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ

మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగుంది..
ఇంటి కొనుగోళ్లకు మార్కెట్‌ సెంటిమెంట్‌ భారీగా మెరుగుపడినందున భారతదేశం అంతటా అమ్మకాలు డిసెంబర్‌ త్రైమాసికంలో అలాగే 2022లో భారీ జంప్‌ను చూశాయి. కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటలో ఉన్న చాలా మంది కస్టమర్‌లు ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి వచ్చారు. దీనివల్లే చివరకు బ్లాక్‌బస్టర్‌ అమ్మకాలు జరిగాయి.  
– శివాంగ్‌ సూరజ్, ఇన్‌ఫ్రామంత్రా వ్యవస్థాపక డైరెక్టర్‌   

సానుకూలం..
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ రంగ సూచీ సానుకూల శ్రేణిలోనే ఉంది. వచ్చే ఆరు నెలలకు సంబంధించి సూచించే మా ఫ్యూచర్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ కొంత మెరుగుపడింది.   ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, రియల్‌ ఎస్టేట్‌ రంగలో వృద్ధి అవకాశాల దృష్ట్యా భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోరు 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 58కి పెరిగింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57గా ఉంది.     
– శిశిర్‌ బైజాల్, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ
 

మరిన్ని వార్తలు