సెకండ్‌ హ్యాండ్‌ కార్లకే మొగ్గు

14 Sep, 2022 03:58 IST|Sakshi

మెట్రోల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంతే 

నాన్‌ మెట్రోల్లో రెండో వంతు ఓటు 

ఏటా 20 శాతం మేర వృద్ధి 

డాస్‌ వెల్ట్‌ ఆటో నివేదిక 

ముంబై: కొత్త కార్ల కంటే.. అప్పటికే వేరొకరు వాడి విక్రయించే వాటి వైపు (ప్రీఓన్డ్‌ కార్లు) వినియోగదారులు పెద్ద మొత్తంలో మొగ్గుచూపిస్తున్నారు. కొత్త కారుతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కారు చాలా తక్కువ ధరకు రావడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. వినియోగ కార్ల మార్కెట్‌ ఏటా 19.5 శాతం చొప్పున 2026–27 వరకు వృద్ధిని చూపిస్తుందని డాస్‌వెల్ట్‌ ఆటో, ఇండియన్‌ బ్లూబుక్‌ సంయుక్తంగా ప్రీఓన్డ్‌ కార్ల మార్కెట్‌పై ఓ సవివర నివేదికను విడుదల చేశాయి.

ఇందులో డాస్‌ వెల్ట్‌ ఆటో అన్నది ఫోక్స్‌వ్యాగన్‌ ప్రీఓన్డ్‌ కార్ల కంపెనీ కావడం గమనించాలి. దేశంలోని టాప్‌ 40 పట్టణాల్లో ప్రీఓన్డ్‌ కార్లకు ఏటా డిమాండ్‌ 10 శాతం మేర పెరగనుండగా, మిగిలిన పట్టణాల్లో అయితే ఇది ఏటా 30 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2021–22లో ప్రీఓన్డ్‌ కార్ల మార్కెట్‌ విలువ 23 బిలియన్‌ డాలర్లుగా (రూ.1.84 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. 

మారిన మార్కెట్‌ తీరు 
గతంతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ తీరు తెన్నుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆయా కార్లను కంపెనీలు సర్టిఫై చేస్తున్నాయి. తక్కువ వ్యవధికే కార్లు, ద్విచక్ర వాహనాలను మార్చే ధోరణి కూడా పెరిగింది. దీంతో ఇంచుమించు కొత్త వాహనాలే అయినా తక్కువ ధరలకు లభిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో ఆర్జనా శక్తి కలిగిన కస్టమర్లను లక్ష్యం చేసుకుంటున్నాయి. బైబ్యాక్‌ ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఇవన్నీ కలసి ప్రీఓన్డ్‌ కార్ల మార్కెట్‌ను పరుగెత్తిస్తున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. పైగా సంఘటిత రంగంలో ప్రీఓన్డ్‌ కార్లు, ద్విచక్ర వాహనాల వ్యాపారంలోకి కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం కూడా ఈ మార్కెట్‌ బలోపేతానికి సహకరిస్తోంది. 

35 లక్షల కార్ల విక్రయం..  
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల ప్రీఓన్డ్‌ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరం రికార్డులను అధిగమించింది. ఇక అదే ఏడాది అంతర్జాతీయంగా విక్రయాలు 4 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ‘‘మరిన్ని సంస్థలు ప్రీఓన్డ్‌ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో రోడ్డు పక్కన మెకానిక్‌ గ్యారేజ్‌లు, బ్రోకర్ల ద్వారా జరిగే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయ లావాదేవీలు సంఘటిత రంగానికి క్రమంగా మళ్లుతున్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.

సంఘటిత రంగం మార్కెట్‌ వాటా ప్రీఓన్డ్‌ కార్ల విభాగంలో 2021–22 నాటికి 20 శాతం ఉంటే, 2025–26 నాటికి 45 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026–27 నాటికి ప్రీఓన్డ్‌ కార్ల విక్రయాలు 80 లక్షలకు చేరుకోవచ్చని తెలిపింది. కరోనా తర్వాత ఈ మార్కెట్‌ రూపురేఖలే మారిపోయినట్టు పేర్కొంది. 2021–22లో ప్రీఓన్డ్, కొత్త కార్ల రేషియో 1:4గా ఉండగా, ఇది 2026–27 నాటికి 1:9కు చేరుకుంటుందని తెలిపింది.

నాన్‌ మెట్రోల్లో 64 శాతం మంది ప్రీఓన్డ్‌ కారును తమ మొదటి వాహనంగా చేసుకుంటుంటే, మెట్రోల్లో ఇలాంటి వారు 55 శాతం ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సరఫరా అయిన మొత్తం ప్రీఓన్డ్‌ కార్లలో 65 శాతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు