స్మార్ట్‌ఫోన్ల జాతర.. యాపిల్‌ నుంచి హువావే వరకు

15 Oct, 2021 11:18 IST|Sakshi

పండగ సీజన్‌ని క్యాష్‌ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు రెడీ అయ్యాయి. దసరా మొదలు న్యూ ఇయర్‌ వరకు ఉన్న ఫెస్టివ్‌ సీజన్‌లో వరుసబెట్టి ఫోన్లు రిలీజ్‌ చేసేందుకు స్పెషల్‌ ఈవెంట్‌లను వేదికగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి గ్యాడ్జెట్‌ లవర్స్‌లో పెరిగిపోతుంది. 

యాపిల్‌తో మొదలు
స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచలో యాపిల్‌ది ప్రత్యేక స్థానం, మెటల్‌బాడీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, యాప్‌స్టోర్‌, టాప్‌నాచ్‌ ఇలా ఒక్కటేమిటీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫీచర్లలో సగానికి సగం యాపిల్‌ పరిచయం చేసినవి లేదా యాపిల్‌ వల్ల పాపులర్‌ అయినవే ఉన్నాయి. అందువల్లే యాపిల్‌ ఈవెంట్‌ అంటే ప్రపంచమంతటా ప్రత్యేక ఆసక్తి. మొబైల్‌ టెక్నాలజీలో కొత్తగా ఏం పరిచయం చేయబోతున్నారనే కుతూహలం నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా అక్టోబరు 18న యాపిల్‌ ఆన్‌లీషెడ్‌ ఈవెంట్‌ జరగనుంది.

గూగుల్‌ సైతం 
ప్రపంచంలో ఎనభై శాతం స్మార్ట్‌ ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ మీదనే రన్‌ అవుతున్నా.. మార్కెట్‌ లీడర్‌ అనదగ్గ ఒక్క ఫోన్‌ రిలీజ్‌ చేయలేదనే వెలితి గూగుల్‌ని పట్టి పీడిస్తోంది. నెక్సస్‌, మోటో, పిక్సెల్‌ తదితర బ్రాండ్‌ నేమ్‌లతో పదేళ్లుగా గూగుల్‌ మొబైల్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 19న పిక్సెల్‌ 6 మొబైల్‌ని రిలీజ్‌ చేయనుంది. ఇందులో కొత్తగా టెన్సర్‌ చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది గూగుల్‌. ఈసారైనా ఈ టెక్‌ దిగ్గజ కంపెనీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. 

మరో సిరీస్‌లో వన్‌ప్లస్‌
హైఎండ్‌ ఫీచర్లు అతి తక్కువ ధరలో అనే కాన్సెప్టుతో వచ్చి శామ్‌సంగ్‌, యాపిల్‌కు చుక్కలు చూపించింది వన్‌ ప్లస్‌ బ్రాండ్‌. కేవలం దీని వల్లే హై ఎండ్‌బ్రాండ్‌ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ పరంపరలో 9 సిరీస్‌కి సంబంధించిన వివరాలు అక్టోబరు 19న వెల్లడించనుంది వన్‌ప్లస్‌.

మేము వస్తున్నాం
యాపిల్‌, గూగుల్‌లకి పోటీగా అన్‌ ప్యాకెడ్‌ ఈవెంట్‌ని ప్రకటించింది శామ్‌సంగ్‌. అ‍క్టోబరు 20న జరగబోయే ఈ సమావేశంలో తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)కి సంబంధించి గ్యాడ్జెట్లను శామ్‌సంగ్‌ పరిచయం చేయనుంది. 

మళ్లీ వస్తోన్నఎక్స్‌పీరియా 
అక్టోబరులోనే కొత్త ఎక్స్‌పీరియా ఫోన్‌ని పరిచయం చేసేందుకు సోనీ రెడీ అవుతోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చెలరేగిన సోని.. గత ఐదేళ్లుగా గప్‌చుప్‌గా ఉంది. కాగా మరోసారి ఇండియన్‌ మార్కెట్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అక్టోబరు 26న ఎక్స్‌పీరియా ఈవెంట్‌ నిర్వహిస్తోంది. సోనితో పాటే ఇదే నెలలో ఒప్పో, ఆనర్, హువావే, ఐక్యూ కంపెనీలు సైతం కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి తేబోతున్నాయి.

ఏడాది చివరినాటికి
బడ్జెట్‌ ఫోన్లతో దేశంలో సగం మార్కెట్‌ని ఆక్రమించిన రెడ్‌మీ, రియల్‌మీ సంస్థలు సైతం రాబోయే నెలల్లో కొత్త ఫోన్లు తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు వీటి సబ్సిడరీ కంపెనీలైన ఆనర్‌, పోకోలు ధరల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. 

చదవండి:6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

మరిన్ని వార్తలు