గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!

9 Jan, 2022 19:41 IST|Sakshi

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. ఈ రోజు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది. 

వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని వారు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యపై ఎన్‌పీసీఐ స్పందించింది. ఎన్‌పీసీఐ ఒక ట్వీట్‌ చేస్తూ యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది.

అయితే, ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్‌ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్‌లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్‌లో తెలిపారు. 

(చదవండి: కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి తయారీ కంపెనీల షాక్..!) 

మరిన్ని వార్తలు