డిజిటల్‌ చెల్లింపులు: ఆగస్టులో రికార్డు బద్దలు! ఏయే యాప్‌లు ఎంతెంతంటే..

2 Sep, 2021 13:27 IST|Sakshi

కరోనా కారణంగా డిజిటల్‌ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్‌కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్‌లైన్‌ పేమెంట్‌లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో  అన్ని పేమెంట్‌ యాప్‌ల నుంచి డిజిటల్‌ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. 
 

యూపీఐ సంబంధిత లావాదేవీలు రికార్డు లెవెల్‌ను చేరుకున్నాయి.  ఒక్క ఆగష్టు నెలలోనే 6.39 ట్రిలియన్‌ రూపాయల విలువైన చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు నెలలో సుమారు 3.5 బిలియన్ల ట్రాన్‌జాక్షన్స్‌ యూపీఐ యాప్‌ చెల్లింపుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా కిందటి నెలతో పోలిస్తే ట్రాన్‌జాక్షన్స్‌ రేటు 9.5 శాతం పెరగ్గా.. ట్రాన్‌జాక్షన్స్‌ విలువ 5.4 శాతం పెరిగింది. 

ఏప్రిల్‌ మే నెల మధ్య సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కొంతవరకు తగ్గినా.. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇక యూపీఐ మోడ్‌లో చెల్లింపులు జులైలో 3.24 బిలియన్‌ ట్రాన్‌జాక్షన్స్‌(జూన్‌తో పోలిస్తే 15.7 శాతం) జరగ్గా.. ఆగష్టులో అది మరింత పెరిగింది. 2016లో మొదలైన యూపీఐ సర్వీస్‌ చెల్లింపులు.. కరోనా కారణంగా పుంజుకున్నాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్‌ ఉండగా.. అందులో ఫోన్‌పే(వాల్‌మార్ట్‌), గూగుల్‌పే(గూగుల్‌) ఆ తర్వాత పేటీఎం, అమెజాన్‌ పే.. డిజిటల్‌ మార్కెట్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాయి.
 

యూపీఐతో పాటు ఇమ్మిడియట్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌(IMPS) ద్వారా ఆగష్టులో 377.94 మిలియన్‌ ట్రాన్‌జాక్షన్స్‌ జరిగాయని, జులైతో పోలిస్తే అది 8.5 శాతం పెరుగుదలగా ఉందని, ట్రాన్‌జాక్షన్స్‌ విలువ 3.18 ట్రిలియన్‌ రూపాయలుగా పేర్కొంది.

ఎన్‌పీసీఐ డెవలప్‌ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌(టోల్‌ కలెక్షన్‌ కోసం రూపొందించిన ప్రోగ్రాం).. ద్వారా ఆగష్టులో 201.2 మిలియన్‌ ట్రాన్‌జాక్షన్స్‌ జరగ్గా.. విలువ మూడువేల కోట్ల రూపాయలుగా ఉంది. అదే విధంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా 58.88 మిలియన్‌ ట్రాన్‌జాక్షన్స్‌ జరగ్గా.. వాటి విలువ పది వేల కోట్లకుపైనే ఉంది.

చదవండి: అకౌంట్‌ లేకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌!

మరిన్ని వార్తలు