టిక్‌టాక్‌ విక్రయానికి గడువు పెంపు

26 Nov, 2020 10:29 IST|Sakshi

డిసెంబర్‌ 4వరకూ తాజా గడువు

7 రోజుల గడువు పెంచిన ప్రెసిడెంట్‌ ట్రంప్‌

ఈ నెల 10న ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన బైట్‌డ్యాన్స్‌ 

వాషింగ్టన్‌: ప్రస్తుత ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పాలనా విభాగం టిక్‌టాక్ విక్రయానికి మరో 7 రోజుల గడువును పెంచింది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. దీంతో డిసెంబర్‌ 4లోగా చైనీస్‌ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని విక్రయించేందుకు వీలు చిక్కింది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ విక్రయానికి ఆగస్ట్‌లోనే ఆదేశించిన ట్రంప్‌ ప్రభుత్వం తదుపరి గడువును 15 రోజులపాటు పెంచిన విషయం విదితమే. ఈ గడువు సైతం శుక్రవారం(27)తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా 7 రోజుల గడువునిచ్చింది. తొలుత ట్రంప్‌ ప్రభుత్వం టిక్‌టాక్‌ యాప్‌ను విక్రయించవలసిందిగా బైట్‌డ్యాన్స్‌ను ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువునిస్తూ ఆగస్ట్‌ 14న ఆదేశాలు జారీ చేసింది. కాగా.. టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగం విక్రయానికి చైనీస్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ కొద్ది రోజులుగా చర్చలు నిర్వహిస్తూ వస్తోంది. టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో తొలుత మైక్రోసాఫ్ట్‌ పేరు వినిపించినప్పటికీ తదుపరి రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇంక్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ రేసులోకి వచ్చిన విషయం విదితమే. 

ప్రతిపాదన ఇలా
ఈ నెల 10న టిక్‌టాక్ విక్రయంపై యూఎస్‌ ప్రభుత్వానికి బైట్‌డ్యాన్స్‌ ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇదేవిధంగా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్‌ యూఎస్‌ వినియోగదారుల డేటా, కంటెంట్‌ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్‌ కంపెనీలు చేపడతాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు