హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్

17 Aug, 2020 11:54 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రైవేటురంగ  బ్యాంకు  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది.  అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ బ్యాంకుపై క్లాస్ యాక్షన్ వ్యాజ్యం దాఖల్ చేసింది..పొటెన్షియల్ సెక్యూరిటీ
క్లెయిమ్స్ పై షేర్ హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్టు  కంపెనీ ఒక  ప్రకటనలో తెలియజేసింది.  

వాస్తవాలు దాచిపెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు సంస్థ తెలిపింది. ఈ బ్యాంక్ సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు కూడా దీనికి మద్దతు పలకాలంటూ కోరింది. తమ ఫిర్యాదును నమోదు చేయాల్సిందిగా ఒక వెబ్ సైట్ సమాచారాన్ని అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ వాహన-ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానంపై దర్యాప్తు జరిపినట్లు జూలై 13న బ్యాంకు నివేదించిన కొద్ది రోజుల తరువాత  ఈ పరిణామం చోటు చేసుకుంది.

వాహన రుణాల టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన బ్యాంక్ ఆరుగురు సీనియర్, మధ్య స్థాయి అధికారులను తొలగించింది. అయితే దీనిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్ పీరియన్ కూడా బ్యాంకుపై గత నెలలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని ఈ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే 2020-21 తొలి త్రైమాసిక  ఫలితాలపైన అనుమానాలును వ్యక్తం  చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వాటాదారులకు రక్షణగా నిలిచే సంస్థ రోసన్ లా దావా సంచలనంగా మారింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయాన్ని, లాభాలను పెంచుకునేందుకు ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్ మెంట్ తప్పుడు విధానాలను చేపట్టిందంటూ ఈ సంస్థ గత సంవత్సరం ఒక క్లాస్ యాక్షన్ దావా వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు