ఫెడ్‌ రేట్ల నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి

19 Sep, 2022 04:57 IST|Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులూ కీలకమే

చమురు ధరలు, రూపాయిపైనా కన్ను

ఈ వారం ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్‌ ప్రధానంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్‌ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్‌వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు, బ్యాంక్‌ ఆప్‌ ఇంగ్లండ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు.

పెట్టుబడుల ప్రభావం
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్‌ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్‌పట్ల గ్లోబల్‌ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్‌ ఫెడ్‌పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ నిపుణులు అజిత్‌ మిశ్రా, శామ్‌కో సెక్యూరిటీస్‌ నిపుణులు అపూర్వ సేథ్‌ అభిప్రాయపడ్డారు.

గత వారం వెనకడుగు
యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్‌ 952 పాయింట్లు  పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్‌ బలపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.  

ఎఫ్‌పీఐల దన్ను
తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్‌లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్‌చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్‌పీఐలు 2021 అక్టోబర్‌– 2022 జూన్‌ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్‌పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు