మార్కెట్‌కు ‘ఫెడ్‌’ పోటు

18 Jun, 2021 08:35 IST|Sakshi

సెన్సెక్స్‌ నష్టం 179 పాయింట్లు 

ముంబై: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్‌ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్‌ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్‌ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు.
 

చదవండి: వేల కోట్ల నష‍్టం: అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ స్పందన

మరిన్ని వార్తలు