యూఎస్‌ మార్కెట్లు అప్‌- క్రూయిజర్‌ షేర్ల స్పీడ్

26 Sep, 2020 08:51 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య వారాంతాన లాభాల ముగింపు

డోజోన్స్‌ 359- నాస్‌డాక్‌ 241 పాయింట్లు ప్లస్‌

వరుసగా 4వ వారం నష్టాల్లో- టెస్లా ఇంక్‌ జోరు

యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌ జూమ్‌

ఈ నెలలో మార్కెట్లు 4.4-7.3 శాతం మధ్య డౌన్‌

యాపిల్‌ 13 శాతం,  ఇతర ఫాంగ్‌ స్టాక్స్‌ 8 శాతం పతనం

దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగశాయి. డోజోన్స్‌ 359 పాయింట్లు(1.35%) పెరిగి 27,174 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 52 పాయింట్ల(1.6%) లాభంతో 3,298 వద్ద  నిలిచింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 241 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డోజోన్స్‌ 1.8 శాతం నష్టపోగా.. ఎస్‌అండ్‌పీ 0.6 శాతం నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్‌ పెడుతూ నాస్‌డాక్‌ మాత్రం 1.1 శాతం పుంజుకుంది. ఇటీవల కరెక్షన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లు వరుసగా నాలుగో వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్ట్‌ తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. 

ఆశావహ అంచనాలు
వచ్చే వారం హౌస్‌ డెమక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఉపశమన ప్యాకేజీపై వోటింగ్‌ చేపట్టనున్నారు. నిరుద్యోగులకు లబ్దిని పెంచడంతోపాటు.. నష్టాలకు లోనవుతున్న ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక మద్దతు అందించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు రిపబ్లికన్లు ప్రతిపాదించిన ప్యాకేజీకంటే అధికంకావడం విశేషం! దీంతో సెంటిమెంటు బలపడగా.. టెక్నాలజీ దిగ్గజాలలో షార్ట్‌ కవరింగ్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. 

క్రూయిజర్‌  దూకుడు
వారాంతాన ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలో యాపిల్‌ 3.8 శాతం లాభపడగా.. అమెజాన్‌ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్‌ 2.3 శాతం, నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌ 2.1 శాతం చొప్పున ఎగశాయి. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ 5 శాతం జంప్‌చేసింది. క్రూయిజర్‌ నిర్వాహక కంపెనీలు కార్నివాల్‌ 9.7 శాతం, నార్వేజియన్‌ క్రూయిజ్‌ లైన్‌ 13.7 శాతం, రాయల్‌ కరిబియన్‌ 7.7 శాతం చొప్పున దూసుకెళ్లాయి.  

ఈ నెలలో వీక్
మార్కెట్లకు దన్నునిస్తున్న ఫాంగ్‌ స్టాక్స్‌ సెప్టెంబర్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ యాపిల్ 13 శాతం పతనంకాగా.. మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్(గూగుల్‌), నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ సుమారు 8 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో ఈ నెలలో మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్‌ 4.4 శాతం, ఎస్‌అండ్‌పీ 5.8 శాతం చొప్పున పతనంకాగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 7.3 శాతం తిరోగమించడం గమనార్హం!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా