ప్యాకేజీపై ఆశలు- యూఎస్‌ మార్కెట్లు ఓకే

24 Oct, 2020 09:13 IST|Sakshi

అటూఇటుగా ముగిసిన ఇండెక్సులు

సహాయక ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి

డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కుదరని సయోధ్య

క్యూ3 ఎఫెక్ట్‌- 10 శాతం కుప్పకూలిన ఇంటెల్‌ కార్ప్‌

వచ్చే వారం యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ రిజల్ట్స్‌

వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3.465 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 42 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 11,548 వద్ద స్థిరపడింది. అయితే డోజోన్స్‌ నామమాత్రంగా 28 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 28,336 వద్ద ముగిసింది. కొద్ది వారాలుగా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో కదులుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఇటీవల మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం(23)తో ముగిసిన గత వారం డోజోన్స్‌ 1 శాతం, ఎస్‌అండ్‌పీ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. నాస్‌డాక్‌ సైతం 1.1 శాతం క్షీణించింది.

అనిశ్చితిలోనే
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ట్రంప్‌ ప్రతిపాదించిన ప్యాకేజీపై డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని సవరణలు సూచిండంతోపాటు. 2.2 ట్రిలియన్‌ డాలర్లకు పెంచమంటూ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే ఎన్నికలలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు పెలోసీ పేర్కొన్నారు. ఇక మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ప్రత్యర్ధి జోబిడెన్‌ మధ్య వాడిగా, వేడిగా డిబేట్‌ నడిచింది. డిబేట్‌ తదుపరి ఎన్నికలను ప్రభావితం చేసే పలు రాష్ట్రాలలో పరిస్థితులను అంచనా వేయవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అమెక్స్‌ డౌన్‌
ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో మార్జిన్లు బలహీనపడటంతో చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ కార్ప్‌ షేరు 10 శాతం కుప్పకూలింది. కోవిడ్‌-19 కారణంగా డిమాండ్‌ పడిపోవడంతో చిన్న సంస్థలు, వినియోగదారులు చౌక ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకి మళ్లినట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డేటా సెంటర్లపై ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపినట్లు వివరించారు. ఫలితంగా ఇంటెల్‌ లాభదాయకత నీరసించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. క్యూ3లో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ షేరు 3.6 శాతం నష్టపోయింది. కోవిడ్‌-19 కారణంగా వినియోగం మందగించడంతోపాటు, చెల్లింపుల వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కేటాయింపులు చేపట్టడం అమెక్స్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

గిలియడ్‌ ప్లస్‌
కోవిడ్‌-19 చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదముద్ర వేయడంతో గిలియడ్‌ సైన్సెస్‌ షేరు 0.2 శాతం బలపడింది. అత్యవసర చికిత్సలో భాగంగా ఇప్పటికే ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా.. వచ్చే వారం ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే యాపిల్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌(గూగుల్‌), ఫేస్‌బుక్‌.. క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పనితీరుపై దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

>
మరిన్ని వార్తలు