రెండో రోజూ యూఎస్‌ మార్కెట్లు బోర్లా

5 Sep, 2020 09:22 IST|Sakshi

టెక్‌ దిగ్గజాలలో అమ్మకాల ఎఫెక్ట్‌

ఆగస్ట్‌లో మెరుగుపడ్డ ఉపాధి గణాంకాలు 

దీంతో భారీ నష్టాల నుంచి మార్కెట్ల రికవరీ

సహాయక ప్యాకేజీపై కుదరని సయోధ్య

పబ్జీపై ఇండియా నిషేధంతో టెన్సెంట్‌ డీలా

టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా వరుసగా రెండో రోజు యూఎస్‌ మార్కెట్లకు షాక్‌ తగిలింది. దీంతో తొలి సెషన్‌లో డోజోన్స్‌ 628 పాయింట్లు పతనమైంది. అయితే ఆగస్ట్‌లో ఉపాధి పుంజుకున్నట్లు వెల్లడికావడంతో రికవరీ బాట పట్టాయి. అయినప్పటికీ ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్‌ 159 పాయింట్ల(0.6%) నష్టంతో 28,133 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 145 పాయింట్లు(1.3%) వెనకడుగుతో 11,313 వద్ద స్థిరపడింది. కోవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్‌ దిగ్గజాలలో భారీ అమ్మకాలతో గురువారం డోజోన్స్‌ 800 పాయింట్లు పడిపోగా.. నాస్‌డాక్‌ 5 శాతం కుప్పకూలిన విషయం విదితమే.

సాఫ్ట్‌బ్యాంక్‌ దెబ్బ!
ఇటీవల జపనీస్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరించడం ద్వారా టెక్నాలజీ స్టాక్స్‌లో భారీ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. కాగా.. ఆగస్ట్‌లో కొత్తగా 1.37 మిలియన్‌ ఉద్యోగాలు లభించినట్లు తాజా గణాంకాలు వెలడించాయి. అంతేకాకుండా అంచనాల(14.7 శాతం) కంటే తక్కువగా నిరుద్యోగిత 8.4 శాతంగా నమోదైంది. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు కోలుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. 

నష్టాల బాట..
వారాంతాన ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌ గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌ 3-1.4  శాతం మధ్య క్షీణించాయి. ఈ బాటలో జూమ్‌ 3 శాతం పతనంకాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ యథాతథంగా ముగిసింది. ఇతర కౌంటర్లలో తొలుత 6 శాతం పతనమైన ఆటో దిగ్గజం టెస్లా దాదాపు 3 శాతం లాభంతో నిలిచింది. బ్లూచిప్స్‌ బోయింగ్‌, హెచ్‌పీఈ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. కాగా.. చైనీస్‌ టెక్‌ దిగ్గజం టెన్సెంట్‌ షేరు రెండు రోజుల్లో 5 శాతం నీరసించడంతో 34 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను కోల్పోయింది. పబ్జీ గేమ్‌ను ఇండియాలో నిషేధించడం ఈ కౌంటర్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు