యూఎస్‌ మార్కెట్లకు జో బైడెన్‌ జోష్‌

4 Nov, 2020 10:05 IST|Sakshi

ఫెడరల్‌ రిజర్వ్‌ సమీక్షా సమావేశాలు షురూ

2 శాతం జంప్‌చేసిన డోజోన్స్‌, నాస్‌డాక్‌

అలీబాబా గ్రూప్‌ షేరు 10 శాతం పతనం

0.4 శాతం పుంజుకున్న డాలరు ఇండెక్స్‌

మళ్లీ బలపడుతున్న చమురు ధరలు

డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్‌ 555 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 27,480కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 59 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 3,369 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 203 పాయింట్ల(1.9 శాతం) వృద్ధిచూపి 11,161 వద్ద స్థిరపడింది. బైడెన్‌ గెలిస్తే ఎన్నికలకు ముందు డెమొక్రాట్లు పట్టుపట్టిన 2.2 ట్రిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్‌ కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. 

ఫెడ్‌పై కన్ను
ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.4 శాతం ఎగసింది. మళ్లీ 94 దిగువన 93.49కు చేరింది. ఇక పసిడి ఔన్స్‌ 1900 డాలర్లను అధిగమించింది. బీఎన్‌పీ పరిబాస్‌సహా బ్యాంకింగ్‌ దిగ్గజాల సానుకూల ఫలితాల కారణంగా మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు 2.5 శాతం జంప్‌చేశాయి.  

చమురు అప్‌
గత వారం పతన బాట పట్టిన ముడిచమురు ధరలు రెండు రోజులుగా బౌన్స్‌బ్యాక్‌ సాధిస్తున్నాయి. రష్యాసహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతలను మరికొంతకాలం కొనసాగించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 3 శాతం జంప్‌చేయగా.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు 2.7 శాతం లాభపడింది. ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 1.4 శాతం ఎగసి 38.18 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ సైతం 1.2 శాతం బలపడి 40.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

యాంట్‌కు చెక్‌
భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న యాంట్‌ గ్రూప్‌ పబ్లిక్‌ ఇష్యూకి చైనీస్‌ ప్రభుత్వం చెక్‌ పెట్టడంతో మంగళవారం అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. యాంట్‌ గ్రూప్‌లో అలీబాబాకు మూడో వంతు వాటా ఉండటం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఫాంగ్‌ స్టాక్స్‌ అప్‌
ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌, నెట్‌ఫ్లిక్స్‌ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ సైతం దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్‌ 3.5 శాతం, మోడర్నా ఇంక్‌ 3 శాతం చొప్పున లాభపడ్డాయి.  

మరిన్ని వార్తలు