కరెక్షన్‌ బాటలో యూఎస్‌ మార్కెట్లు

24 Sep, 2020 10:59 IST|Sakshi

డోజోన్స్‌ 525- నాస్‌డాక్‌ 331 పాయింట్లు పతనం

ఇటీవల గరిష్టం నుంచి మార్కెట్లు 10 శాతం డౌన్‌

10 శాతం కుప్పకూలిన టెస్లా ఇంక్‌

యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వీక్

‌ ఏఎండీ, ఎన్‌విడియా 4 శాతం డౌన్‌- నైక్‌ ఇంక్‌ 9 శాతం జూమ్‌

ఓవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, మరోపక్క సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్‌ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 79 పాయింట్ల(2.4%) నష్టంతో 3,237 వద్ద  నిలిచింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 331 పాయింట్లు(3%) పతనమై 10,633 వద్ద స్థిరపడింది. దీంతో ఈ నెలలో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్‌అండ్‌పీ 10 శాతం, నాస్‌డాక్‌ 12 శాతం చొప్పున వెనకడుగు వేసినట్లయ్యింది. డోజోన్స్‌ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్‌ గరిష్టంకంటే 9.4 శాతం దిగువన నిలిచింది. ఇది కరెక్షన్‌కు సంకేతమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం మార్కెట్లు బలపడినప్పటికీ తిరిగి అమ్మకాలు ఊపందుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్ల ర్యాలీకి కారణమైన టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు.

డౌన్‌ డౌన్‌..
ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలో యాపిల్‌ 4.2 శాతం పతనమైంది. ఈ బాటలో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ 4-2.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కంప్యూటర్‌ చిప్‌ తయారీ కంపెనీలు ఎన్‌విడియా, ఏఎండీ సైతం 4 శాతం వెనకడుగు వేశాయి. ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీల తయారీ అంశంలో ఎదురవుతున్న సవాళ్లపై సీఈవో ఎలెన్‌ మస్క్‌ వ్యాఖ్యలతో టెస్లా ఇంక్‌ 10.3 శాతం కుప్పకూలింది. అయితే స్పోర్ట్స్‌, లైఫ్‌స్టైల్‌ ప్రొడక్టుల కంపెనీ నైక్‌ ఇంక్‌ 9 శాతం దూసుకెళ్లింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు