యూఎస్‌ మార్కెట్స్‌- టెక్‌ దిగ్గజాల దెబ్బ

2 Nov, 2020 11:02 IST|Sakshi

2.5 శాతం పతనమైన నాస్‌డాక్‌

ఫేస్‌బుక్‌, యాపిల్‌, అమెజాన్‌ 6 శాతం డౌన్‌

మోడర్నా, నెట్‌ఫ్లిక్స్‌, టెస్లా 5.5 శాతం వీక్‌

21 శాతంపైగా పడిపోయిన ట్విటర్‌ ఇంక్‌

గత వారం 6.5 శాతం క్షీణించిన డోజోన్స్‌ 

రికార్డ్‌ గరిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ 9 శాతం డీలా

పలు దేశాలలో మళ్లీ కోవిడ్‌-19 కేసులు విజృంభిస్తుండటంతో శుక్రవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నాస్‌డాక్‌ 2.5 శాతం పతనమైంది. డోజోన్స్‌ 158 పాయింట్లు(0.6 శాతం) క్షీణించి 26,502కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 40 పాయింట్లు(1.2 శాతం) నష్టంతో 3,270 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 274 పాయింట్లు(2.5 శాతం) కోల్పోయి 10,912 వద్ద స్థిరపడింది. వెరసి గత వారం డోజోన్స్‌ 6.5 శాతం పతనంకాగా.. ఎస్‌అండ్‌పీ 5.6 శాతం, నాస్‌డాక్‌ 5.5 శాతం చొప్పున నీరసించాయి. ఫలితంగా ఈ సెప్టెంబర్‌ మొదట్లో నమోదైన సరికొత్త గరిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 9 శాతం వెనకడుగు వేసినట్లయ్యింది. ఇక అక్టోబర్‌ నెలలో చూస్తే.. డోజోన్స్‌ 4.6 శాతం, ఎస్‌అండ్‌పీ 2.8 శాతం చొప్పున క్షీణించగా.. నాస్‌డాక్‌ 2.3 శాతం నష్టపోయింది.

కోవిడ్‌-19 షాక్‌
కొద్ది రోజులుగా యూఎస్‌లో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 90 లక్షలను మించింది. దీనికితోడు సెకండ్‌వేవ్‌లో భాగంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర యూరోపియన్‌ దేశాలలో కోవిడ్‌-19 బాధితులు పెరుగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తాజాగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పూర్తిస్థాయి లాక్‌డవున్‌లకు  తెరతీయగా.. పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి కుదేలయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో వారాంతాన యూరోపియన్‌, యూఎస్‌ మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోపక్క యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. 

పతన బాటలో..
వారాంతాన మైక్రో బ్లాగింగ్‌ కంపెనీ ట్విటర్‌ ఇంక్‌ క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది, అంచనాలకంటే తక్కువగా యూజర్లు నమోదుకావడంతోపాటు.. యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆదాయం క్షీణించే వీలున్నట్లు అంచనా వేసింది. దీంతో ట్విటర్‌ షేరు 21 శాతంపైగా పడిపోయింది. ఈ బాటలో ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలోనూ అమ్మకాలు పెరిగాయి. 2021లో కఠిన పరిస్థితులు ఎదురుకానున్నట్లు పేర్కొనడంతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 6.3 శాతం పతనమైంది. కోవిడ్‌-19 కారణంగా వ్యయాలు పెరగనున్న అంచనాలతో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 5.5 శాతం నీరసించింది. క్యూ3లో గత రెండేళ్లలోలేని విధంగా ఐఫోన్ల అమ్మకాలు క్షీణించడంతో యాపిల్‌ ఇంక్‌ 5.6 శాతం నష్టపోయింది. 5జీ ఫోన్ల విడుదలలో జాప్యం ఐఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

గూగుల్‌ అప్‌
త్రైమాసిక అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనాలు ప్రకటించడంతో ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ ఇంక్‌ షేరు 3.5 శాతం ఎగసింది. ప్రకటనల ఆదాయం తిరిగి ఊపందుకోనుండటం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో టెక్‌ కౌంటర్లలో నెలకొన్న ట్రెండుకు ఎదురీదినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇతర కౌంటర్లలో మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌, ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ సైతం 5.5 శాతం చొప్పున పడిపోయాయి. 

మరిన్ని వార్తలు