2 రోజుల నష్టాలకు చెక్‌- మోడర్నా జోరు

28 Jul, 2020 10:35 IST|Sakshi

మోడర్నా ఇంక్‌ 9 శాతం జూమ్‌

రెండు రోజుల్లో ఫాంగ్‌ స్టాక్స్‌ ఫలితాలు

7నానోమీటర్‌ చిప్‌ తయారీ- టీఎస్‌ఎం హైజంప్‌

క్రూయిజర్‌ స్టాక్స్‌ పతనం

ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌ 115 పాయింట్లు(0.4 శాతం) బలపడి 26,585కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 24 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 3239 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 173 పాయింట్లు(1.7 శాతం) ఎగసి 10,536 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. 

600 బిలియన్‌ డాలర్లు
కోవిడ్‌-19 కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా రిపబ్లికన్‌ సెనేట్స్‌ 600 బిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి నుంచి కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజులపాటు పరపతి సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్యాకేజీలపై దృష్టి సారించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. హ్యూస్టన్‌, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్‌, చైనా మధ్య చెలరేగిన వివాదాలు రెండు రోజులుగా మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే.

ఫాంగ్‌ స్టాక్స్‌ 
ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్‌, అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఫాంగ్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా నాస్‌డాక్‌ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న మోడర్నా ఇంక్‌ తాజాగా ప్రభుత్వం నుంచి 47.2 కోట్ల డాలర్ల ఎయిడ్‌ను అందుకుంది. దీంతో ఈ షేరు 9.2 శాతం దూసుకెళ్లింది. డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్‌ వెలువడవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ బాటలో బయోజెన్‌ 5 శాతం ఎగసింది. క్యూ2 నిరాశపరచడంతో బొమ్మల తయారీ కంపెనీ హాస్‌బ్రో 7.4 శాతం, గ్రాసరీస్‌ కంపెనీ ఆల్బర్ట్‌సన్స్‌ 5.4 శాతం చొప్పున పతనమయ్యాయి.  అల్భాబెట్‌ 1.4 శాతం పుంజుకోగా.. తైవాన్‌ కంపెనీ టీఎస్‌ఎం షేరు దాదాపు 13 శాతం జంప్‌చేసింది. 7నానోమీటర్‌ చిప్స్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించడం ఇందుకు దోహదపడింది. ఇతర కౌంటర్లలో కోవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా క్రూయిజర్‌ కంపెనీలు కార్నివాల్‌, నార్వేజియన్‌, రాయల్‌ కరిబియన్‌ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. 

>
మరిన్ని వార్తలు