అమెరికాలో నివసిస్తున్న ఇండియన్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!

10 Feb, 2023 16:11 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్‌కు గురై.. కొత్త జాబ్‌ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది.

2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్‌ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్‌-1బీ వీసా దారులు రెన్యువల్‌ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 

వీసా ఉంటేనే ఎంట్రీ
లేఆఫ్స్‌ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్‌ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్‌, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. 

జోబైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి
ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్‌ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్‌ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్‌ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్‌ను చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్‌లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్‌), స్టాంపింగ్‌ చేసేందుకు సిద్ధమైంది. 
     
ఇబ్బందుల్ని తొలగించాలనే  
సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్‌-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్‌ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్‌ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు  వీసా గడువు ముగిసి.. రెన్యూవల్‌ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. 

ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్‌ ప్రభుత్వం నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా (ఎన్‌ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్‌ను ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి  దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ఎన్ని వీసాలో చెప్పలేం
వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు.

మరిన్ని వార్తలు