రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా

27 Aug, 2022 11:06 IST|Sakshi

భారత్‌పై అమెరికా ఒత్తిడి 

న్యూఢిల్లీ: రష్యన్‌ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన  అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్‌ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్‌ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది.  

మరిన్ని వార్తలు