భారత ఎగుమతుల్లో అమెరికాకే ఎక్కువ!

24 Jun, 2022 18:57 IST|Sakshi

కోల్‌కతా: భారత్‌ నుంచి మే నెలలో ఎగుమతుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉందని ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతుల మండలి ఈఈపీసీ తెలిపింది. చైనాకు గత నెలలో భారత్‌ నుంచి ఎగుమతులు 52 శాతం తగ్గినట్టు పేర్కొంది.

భారత ఇంజనీరింగ్‌ ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 25 ఎగుమతి మార్కెట్లలో 18 మార్కెట్లకు సానుకూల వృద్ధి నమోదైనట్టు ప్రకటించింది. ‘‘మే నెలలో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 9.79 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2021లో మే నెల ఎగుమతులు 8.62 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది’’అని ఈఈపీసీ తెలిపింది. ఐరన్‌ ఓర్, స్టీల్, స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతులు 16 శాతం పెరిగి 2.63 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

అమెరికాకు ఎగుమతులు 63 శాతం పెరిగి 1.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాకు ఎగుమతులు 52 శాతం తగ్గి 217 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 452 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. చైనాలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతుండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు