V-Trans India Limited: మూడేళ్లలో రూ. 3,000 కోట్ల టర్నోవరు

27 Apr, 2023 02:54 IST|Sakshi

వీ–ట్రాన్స్‌ లక్ష్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ వీ–ట్రాన్స్‌ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,000 కోట్ల టర్నోవరు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో 600 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనుంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్‌ మహేంద్ర షా ఈ వివరాలు వెల్లడించారు.

కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్‌ రంగానికి, తద్వారా తమ సంస్థ వృద్ధికి ఊతం లభించగలదని ఆయన వివరించారు. దేశీయంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా గిడ్డంగులు, కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు షా చెప్పారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ రాజేష్‌ షా చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000 పైగా శాఖలు, 50 పైచిలుకు ట్రాన్స్‌షిప్‌మెంట్‌ సెంటర్లు, 2,500 పైగా ట్రక్కులు ఉన్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు