వ్యాక్సిన్ బూస్ట్- టెక్ దిగ్గజాల షాక్

10 Nov, 2020 10:05 IST|Sakshi

డోజోన్స్ హైజంప్- నాస్‌డాక్‌ పతనం

3 శాతం ఎగసిన డోజోన్స్ ఇండెక్స్

1.2 శాతం బలపడిన ఎస్‌అండ్‌పీ

1.5 శాతం నష్టపోయిన నాస్‌డాక్‌

ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం అప్

బయోజెన్ 30 శాతం- జూమ్ వీడియో 17 శాతం డౌన్

ఎంటర్ టైన్మెంట్- ఎయిర్ లైన్స్ షేర్లకు వ్యాక్సిన్ పుష్

న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సఫలమైనట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ప్రకటించింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు నవంబర్ చివరిలోగా యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగానికి అనుమతి లభించే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు వ్యాక్సిన్ బూస్ట్ లభించింది. డోజోన్స్‌ 835 పాయింట్లు(3 శాతం) జంప్‌ చేసి 29,158కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 41 పాయంట్లు(1.2 శాతం) ఎగసి 3,551 వద్ద ముగిసింది. అయితే టెక్‌ దిగ్గజాలలో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నాస్‌డాక్‌ 181 పాయింట్లు(1.5 శాతం) పతనమై 11,714 వద్ద స్థిరపడింది.

కార్నివాల్ జోరు
వ్యాక్సిన్ ఆశలతో ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం చొప్పున జంప్ చేయగా.. ఆస్ట్రాజెనెకా 2.5 శాతం క్షీణించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుందన్న అంచనాలతో సోమవారం ఎంటర్ టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఏఎంసీ 50 శాతం, కార్నివాల్ కార్పొరేషన్ 39 శాతం, సిక్స్ ఫ్లాగ్స్ 18 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్ లైన్స్ 21 శాతం చొప్పున జంప్ చేశాయి. అయితే జూమ్ వీడియా కమ్యూనికేషన్స్ షేరు 17 శాతం పతనమైంది. కాగా.. అల్జీమర్స్ చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ.. నో చెప్పడంతో బయోజెన్ 30 శాతం కుప్పకూలింది.

ఫాంగ్ స్టాక్స్ డీలా
ఫాంగ్ స్టాక్స్ గా పిలిచే దిగ్గజాలలో నెట్ ఫ్లిక్స్ 8.6 శాతం పతనంకాగా.. ఫేస్ బుక్ 5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.4 శాతం, యాపిల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం డీలాపడింది. ఈ ఏడాది భారీ లాభాలతో ర్యాలీ చేస్తున్న టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో నాస్డాక్ పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు