Expert Opinion: ఈక్విటీల్లో రాబడులను కాపాడుకోవడం ఎలా?

12 Jul, 2021 10:36 IST|Sakshi

క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, కార్పొరేట్‌ బాండ్స్‌ అంటే ఏంటీ ? ఈక్వీటీల నుంచి ఎక్కువ లాభాలు పొందాలంటే ఏం చేయాలని ఇలాంటి అంశాలపై ఇన్వెస్టర్లు, స్టాక్‌ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు మార్కెట్‌ నిపుణులు , వాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ వివరణ మీ కోసం..

నా వయసు 60 ఏళ్లు. ఈక్విటీల్లో నా పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నది నా ఆలోచన. ఈ పెట్టుబడులను బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలా? ఒకవేళ డెట్‌ ఫండ్స్‌కు మారేట్టు అయితే నా పెట్టుబడికి ఏదైనా రిస్క్‌ ఉంటుందా? రెండు నుంచి మూడు మంచి డెట్‌ పథకాలను సూచించగలరు?
– రామకృష్ణ, భీమవరం 

మీ లాభాలను కాపాడుకోవాలనుకుంటే అందుకున్న ఏకైక మార్గం ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడమే. దాంతో మార్కెట్‌పై ఇక ఎంతమాత్రం ఆధారపడి ఉండరు. ఈక్విటీల్లో స్వల్పకాలంలోనే అధిక రిస్క్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, దీర్ఘకాలంలో అంత రిస్క్‌ ఉండదు. మీరు 60 ఏళ్లకు వచ్చి, గణనీయమైన రాబడులను ఈక్విటీల్లో సంపాదించుకున్నారు కనుక.. భవిష్యత్తులో ఈక్విటీలు కరెక్షన్‌ను చూస్తే విచారించకూడదనుకుంటే ఇందులో అధిక భాగాన్ని డెట్‌ ఫండ్స్‌కు మళ్లించడం మంచి ఆలోచనే అవుతుంది.

దీనిని ప్రణాళిక మేరకు చేసుకోవాలి. అంతేకానీ, ఈక్విటీలకు మొత్తంగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు.    ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మధ్య వ్యత్యాసం, వీటిల్లో ఏవి మెరుగన్నది చూస్తే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసినట్టయితే, వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీకు వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఆ లాభాలను తీసుకునే వరకు పన్ను వర్తించదు. ఒకవేళ డెట్‌ ఫండ్స్‌లో లాభాలను స్వీకరించేట్టు అయితే.. అది కూడా ఇన్వెస్ట్‌ చేసి మూడేళ్లలోపు అయితే.. ఆ లాభాలను కూడా ఆదాయంగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. దానిపై మీ పన్ను శ్లాబు మేరకు పన్ను చెల్లించాలి.

ఒకవేళ డెట్‌లో పెట్టుబడులు మూడేళ్లకుపైగా కొనసాగించిన తర్వాత లాభాలను స్వీకరిస్తే అందులో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన లాభాలపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే డెట్‌ ఫండ్స్‌లో రాబడులపై నికరంగా పన్ను భారం తక్కువ ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌లో ఎక్కువ పథకాలు సురక్షితమే. కానీ, రాబడులకు అవి ఎటువంటి హామీ ఇవ్వవు. వీటిల్లో రాబడులు వడ్డీ రేట్లకు అనుగుణంగానే ఉంటుంటాయి. డెట్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు ఇటీవలి పనితీరును చూడకుండా.. పెట్టుబడుల్లో నాణ్యతను చూడాలి. డెట్‌ ఫండ్స్‌లో స్వల్పకాలం కోసం యాక్సిస్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్, ఐడీఎఫ్‌సీ బాండ్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్, ఎల్‌అండ్‌టీ షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్‌లను పరిశీలించొచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన నికర రాబడులను ఆశించొచ్చు.

క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్, కార్పొరేట్‌ బాండ్స్‌ మధ్య వ్యత్యాసం ఏంటి? సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఏది సురక్షితమైనది?
– రిషికేష్, విశాఖపట్నం
క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ మధ్య అంతర్లీనంగా ఉండే వ్యత్యాసం వాటి పెట్టుబడుల్లో ఉండే క్రెడిట్‌ రిస్కే. కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని అత్యధిక నాణ్యత కలిగిన బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ నాణ్యత కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ అన్నవి పెట్టుబడుల్లో అధిక రిస్క్‌ తీసుకుని, అధిక రాబడులను ఇచ్చే విధానంతో పనిచేస్తుంటాయి. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న కంపెనీలు నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లలో ఈ పథకాలు ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయాల్లో ఇటువంటి కంపెనీలు అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తరహా రిస్క్‌ ఉంటుంది కనుక ఆయా సంస్థలు జారీ చేసే బాండ్లపై అధిక వడ్డీ రేటును ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేస్తుంటాయి.

కనుకనే క్రెడిట్‌రిస్క్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. దాంతో అధిక రిస్క్‌ వీటిల్లో ఉంటుంది. ఇక మీరు అడిగిన సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) కోసం అయితే ఈ రెండు కూడా తగినవి కావన్నది నా నమ్మకం. వీటికి బదులు లిక్విడ్‌ ఫండ్స్‌ లేదా అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్నవి లిక్విడిటీ పరంగా, వడ్డీ రేట్ల అస్థితరల పరంగా కాస్త మెరుగైన ఎంపిక అవుతాయి.
 
వాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌

మరిన్ని వార్తలు