ఇండెక్స్‌ ఫండ్స్‌.. ఆప్షన్లు ఎన్నో..!

28 Feb, 2022 00:34 IST|Sakshi

ప్యాసివ్‌గా పనిచేసుకుపోతాయి

లార్జ్‌క్యాప్‌లో ‘యాక్టివ్‌’ కంటే అధిక రాబడి

వ్యయాలు చాలా తక్కువ

రిస్క్‌ సామర్థ్యానికి తగ్గ ఎంపిక

ఒక్క స్మాల్‌క్యాప్‌లోనే భిన్నమైన తీరు

ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మార్కెట్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్యాసివ్‌ ఫండ్స్‌ (ఇండెక్స్‌ ఫండ్స్‌)కు ఆదరణ పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్యాసివ్‌ ఫండ్స్‌ నిర్వహణలో రూ.8,000 కోట్ల ఆస్తులు ఉంటే.. అవి ఇప్పుడు రూ.50,000 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, లార్జ్‌క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్స్‌ పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవడం, తక్కువ వ్యయాలు.. వెరసి ప్యాసివ్‌ ఫండ్స్‌కు ఆదరణ విస్తరిస్తోంది.

ఆయా సూచీల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవే ఇండెక్స్‌ ఫండ్స్‌. ఇండెక్స్‌ పనితీరు స్థాయిలో రాబడులను అందించడం వీటి ప్రత్యేకత. యాక్టివ్‌ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మరి రాబడులు సంగతి ఏమిటి? ఇండెక్స్‌ ఫండ్స్‌లో అసలు ఎన్ని రకాలున్నాయి? తమ లక్ష్యానికి అనుకూలమేనా? వీటికి సమాధానమే ఈ ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ కథనం.

నేడు వివిధ సూచీలను అనుసరించి పెట్టుబడులు పెట్టే ఇండెక్స్‌ ఫండ్స్‌ 50 వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మూమెంటమ్, క్వాలిటీ ఇలా ఎన్నో విభాగాల్లో ప్యాసివ్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకుంటే.. ఈ పథకం నిఫ్టీ–50లోని కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగినట్టు పెట్టుబడులు పెడుతుంది. ఇందులో ఫండ్‌ మేనేజర్‌ ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ, యాక్టివ్‌ ఫండ్స్‌ అలా కాదు.

ఆయా పథకం పెట్టుబడుల విధానాన్ని అనుసరించి ఇండెక్స్‌లో కాకుండా.. మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. వీటిని యాక్టివ్‌లీ మేనేజ్డ్‌ ఫండ్స్‌ అంటారు. వీటిల్లో రాబడులు ఫండ్స్‌ మేనేజర్‌ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న స్వేచ్ఛ వారికి ఉంటుంది. మార్కెట్‌ పరిస్థితులు, కంపెనీల్లో జరిగే పరిణామాలు, ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా వీరు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అధిక రాబడులను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి.

కనుక వీటిల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనో గానీ, గతంతో పోలిస్తే మన మార్కెట్‌ కొంత పరిపక్వత సాధించిన నేపథ్యంలో ఏవో కొన్ని మినహాయిస్తే యాక్టివ్‌లీ మేనేజ్డ్‌ ఫండ్స్‌ రాబడులు సూచీలతో పోలిస్తే ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. అందు కనే ప్యాసివ్‌ ఫండ్స్‌ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్‌ ఫండ్స్‌ మార్కెట్‌ గణనీయంగా ఉంటుంది. మన దగ్గరే ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది. యూఎస్‌ మార్కెట్లో మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల్లో 35% ప్యాసివ్‌ ఫండ్స్‌ నిర్వహణలో ఉన్నాయి.  

లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌
అన్నింటిలోకి లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌ విభాగంలోనే ఎక్కువ యాక్టివ్‌ ఫండ్స్‌ సూచీలకు మించి రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. 2018లో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఫలితంగా ఈ విభాగంలో ప్యాసివ్‌ ఫండ్స్‌ను ఆశ్రయించే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేడు లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌లో (ప్యాసివ్‌ ఫండ్స్‌) ఎన్నో భిన్నమైన పథకాలు అందుబాటులో ఉండడాన్ని గమనించాలి.

నిఫ్టీ 50 టీఆర్‌ఐ, నిఫ్టీ నెక్ట్స్‌ 50 టీఆర్‌ఐ, నిఫ్టీ 100 టీఆర్‌ఐ, ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐ, లో వోలటాలిటీ ఇండెక్స్‌ ఫండ్స్‌ ఇలా చాలా రకాలు ఉన్నాయి. టీఆర్‌ఐ అంటే మొత్తం సూచీ రాబడులుగా చూడాలి.  నిఫ్టీ 50 టీఆర్‌ఐ, సెన్సెక్స్‌ టీఆర్‌ఐ ఫండ్స్‌ అన్నవి ఈ రెండు సూచీల్లోని అగ్రగామి లార్జ్‌క్యాప్‌ కంపెనీలను ప్రతిఫలిస్తాయి. గడిచిన పదేళ్లలో సగటున సూచీల స్థాయిలోనే ఇవి రాబడులు ఇచ్చాయి. అదే విధంగా సూచీలు ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాల్లోనూ ఈ పథకాల్లో నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తే ఈ రెండు సూచీలకు సంబంధించి ఏదేనీ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది.

ఇండెక్స్‌ ఫండ్స్‌కు సంబంధించి ట్రాకింగ్‌ ఎర్రర్‌ అని ఒకటి ఉంటుంది. సూచీతో పోలిస్తే పథకం ఇచ్చిన రాబడులకు మధ్య ఉన్న అంతరమే ట్రాకింగ్‌ ఎర్రర్‌. చాలా వరకు లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌కు ట్రాకింగ్‌ ఎర్రర్‌ 0.10–0.27 శాతం మధ్య ఉంటుంది. అంటే ఒక సూచీ ఏడాది కాలంలో 16 శాతం రాబడులను ఇస్తే, అదే సూచీని అనుసరించే ఇండెక్స్‌ ఫండ్‌ రాబడి 15.90 శాతం మేర ఉండొచ్చు. అప్పుడు 0.10 శాతాన్ని ట్రాకింగ్‌ ఎర్రర్‌గా పేర్కొంటారు. అందుకని ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలంలో సూచీలతో పోలిస్తే తక్కువ ట్రాకింగ్‌ ఎర్రర్‌ ఉండి, తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో పథకం అయితే ఇంకా మంచిది.  

ఐడీఎఫ్‌సీ నిఫ్టీ ఫండ్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.08 శాతం మేర ఉంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌లో 0.17 శాతం ఉంది. వీటి డైరెక్ట్‌ ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ 0.16 శాతం మేర ఎక్స్‌పెన్స్‌ రేషియోను వసూలు చేస్తోంటే, నిప్పన్‌ ఇండియా ఇండెక్స్‌ ఫండ్‌ సెన్సెక్స్‌ ప్లాన్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.15 శాతంగా ఉంది. వీటి ట్రాకింగ్‌ ఎర్రర్‌ 0.16 శాతంలోపే ఉంది. ఇవన్నీ మూడేళ్లకు పైగా పనిచేస్తున్న పథకాలు.  

నిఫ్టీ 100
నిఫ్టీ 100 టీఆర్‌ఐ అన్నది మార్కెట్‌ విలువలో టాప్‌–100 కంపెనీలను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ లార్జ్‌క్యాప్‌ కిందకే వస్తాయి. ఈ లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ను ప్రతిఫలించే ప్యాసివ్‌ ఫండ్స్‌ను ఇటీవలే యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించాయి. కనుక ఈ పథకాలకు దీర్ఘకాల చరిత్ర లేదు. అయినప్పటికీ సూచీల స్థాయిలో రాబడిని వీటి నుంచి ఆశించొచ్చు. ఎన్‌ఎస్‌ఈ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో నిఫ్టీ 100 కంపెనీల వాటా 70 శాతంగా ఉంది. నిఫ్టీ 50, సెన్సెక్స్‌ స్థాయిలోనే రాబడులు వీటిలో ఉండొచ్చు.
 
నిఫ్టీ నెక్ట్స్‌ 50
మార్కెట్‌ విలువ పరంగా 51వ స్థానం నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీ కిందకు వస్తాయి. టాప్‌ 50 కంపెనీలు నిఫ్టీ 50 కింద ఉంటాయి. కానీ, నిఫ్టీ–50తో పోలిస్తే నెక్ట్స్‌ 50లో ఎక్కువ అస్థిరత కనిపిస్తుంది. కనుక రిస్క్‌ను సర్దుబాటు చేసుకునే, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటి ట్రాకింగ్‌ ఎర్రర్‌ 0.14 శాతం మేర ఉంది. ఈ రెండూ కూడా 0.30 శాతం, 0.33 శాతం మేర ఎక్స్‌పెన్స్‌ రేషియోను వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇన్వెస్టర్లు ఎవరైనా నిఫ్టీ–50, నిఫ్టీ నెక్ట్స్‌50 పథకాల్లో విడిగా ఇన్వెస్ట్‌ చేసుకునేట్టు అయితే.. దీనికి బదులు నేరుగా నిఫ్టీ 100 ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సూచీల్లో ఉండే కంపెనీలే నిఫ్టీ 100 సూచీలోనూ ఉంటాయి. కాకపోతే వెయిటేజీ పరంగా అంతరం చూడొచ్చు.  
 
మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌

అధిక రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇండెక్స్‌ ఫండ్స్‌ కోసం చూస్తుంటే.. నిఫ్టీ 150 టీఆర్‌ఐను అనుసరించే నాలుగు పథకాలు ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్‌ ఫండ్స్‌ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఒక్క యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మినహా మిగిలిన అన్ని యాక్టివ్‌ పథకాలు సూచీలకు సమానంగా, అంతకంటే అధిక రాబడులను ఇచ్చాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో సూచీలతో పోలిస్తే అధిక నష్టాలను కూడా పంచాయి. అందుకనే ఈ విభాగంలో ఇండెక్స్‌ ఫండ్స్‌ ఎంపిక మెరుగైనది అవుతుంది. ఉన్న నాలుగు ఇండెక్స్‌ ఫండ్స్‌లో మూడు 2021లో మొదలైనవి. మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన పథకం 2019లో ప్రారంభమైంది. కనుక వీటి రాబడులను విశ్లేషించడానికి కొంత సమయం ఇవ్వాల్సిందే.  
 
స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌

స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే. వీటికి సంబంధించి దీర్ఘకాల ట్రాక్‌ రికార్డు లేదు. ఈ విభాగంలో మూడు పథకాలు ఉండగా, అన్నీ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250టీఆర్‌ఐను అనుసరించేవే.

స్ట్రాటజీ ఇండెక్స్‌ ఫండ్స్‌ (వ్యూహాత్మకమైనవి)
ఇండెక్స్‌లోని కాంపోనెంట్స్‌లోనే కొన్ని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన షేర్లలో ఇవి ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ అన్నది.. నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని మూమెంటమ్‌ పరంగా టాప్‌ 30 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇందుకు ఆయా స్టాక్స్‌ ధరల కదలికలు ప్రామాణికం అవుతాయి. అలాగే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్‌ కూడా ఒకటి. అంటే నిఫ్టీ 100 సూచీలోని 100 కంపెనీల్లో తక్కువ అస్థిరతలతో ఉన్న 30 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌లకు సంబంధించి ఈక్వల్‌ వెయిట్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి.

ఇవేమి చేస్తాయంటే ఆయా సూచీల్లోని కంపెనీల్లో వాటికున్న వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్‌ చేయవు. అన్ని కంపెనీలకు సమాన కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ 50లో ఒక్క రిలయన్స్‌ వెయిటేజీ 10.86 శాతంగా ఉంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్‌ అయితే తనవద్దనున్న నిర్వహణ ఆస్తుల్లో 10.86 శాతాన్ని రిలయన్స్‌కు కేటాయిస్తుంది. ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అలా కాదు. నిఫ్టీ 50 కంపెనీలకు ఒక్కో దానికి 2 శాతం చొప్పున కేటాయింపులు చేస్తుంది. దీనివల్ల ఒకటే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పోగు పడవు. నిఫ్టీలో బ్యాంకింగ్‌ ఇండెక్స్‌కు వెయిటేజీ ఎక్కువ. ఈక్వల్‌ వెయిటేజీ ఇండెక్స్‌ ఫండ్‌కు వస్తే సమాన కేటాయింపులు చేస్తుంది కనుక దీన్ని నిరోధించొచ్చు. ఇండెక్స్‌ ఫండ్స్‌లోనే భిన్నమైన ఎక్స్‌పోజర్‌ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.  

నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్‌
క్వాలిటీ స్కోరు ఆధారంగా నిఫ్టీ 100 కంపెనీల్లో మెరుగైన 30 కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. క్వాలిటీ అంటే.. అధిక లాభదాయకత ను చూపిస్తున్న కంపెనీలు. అంటే కంపెనీల రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) అధికంగా ఉంటుంది. ఈక్విటీతో పోలిస్తే తక్కువ రుణ భారం ఉన్నవి. అలాగే, ఆదాయం, లాభాల్లో పెద్దగా అస్థిరతలు లేనివి ఈ ఇండెక్స్‌ కిందకు వస్తాయి. క్వాలిటీ స్కోరు, ఫ్రీ ఫ్లోట్‌ మా ర్కెట్‌ క్యాప్‌ ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. అయితే, నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్‌ రాబడులు.. నిఫ్టీ 100 కంటే గడిచిన 3–5 ఏళ్లలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాణ్యతకు, తక్కువ అస్థిరతలకు ప్రాధాన్యం ఉం టుంది. అందుకని రాబడి తక్కువ ఉన్నప్పటికీ, మార్కెట్‌ పతనాల్లో నషా ్టలు కూడా పరి మితంగా ఉంటాయని గమనించాలి. ఈ విభాగంలో ఎడెల్వీజ్‌ మ్యూచు వల్‌ ఫండ్‌ ఒక్కటే నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రారంభించి ఆరు నెలలే అయింది. ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.27 శాతమే ఉంది.

నిఫ్టీ 200 మోమెంటమ్‌ 30 ఇండెక్స్‌
ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపిం చిన కంపెనీలు ఈ ఇండెక్స్‌ పరిధిలోకి వస్తాయి. గడిచిన 6, 12 నెలల్లో నిఫ్టీ టాప్‌ 200 కంపెనీల్లో (లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌) అధిక రాబడులను ఇచ్చిన టాప్‌ 30 కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేసేవే నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్స్‌. సూచీల కంటే ఈ పథకాల్లో రాబడి 6% అధికంగా ఉంది. యూటీఐ మ్యూచువల్‌ పండ్, మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూ చువల్‌ ఫండ్‌ సంస్థలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఈ రెండూ గడచిన ఏడాది కాలంలో ఆరంభమైనవి. పెద్దగా ట్రాక్‌ రికార్డు లేదు.

గమనిక
యాక్టివ్‌ ఫండ్స్‌కు సంబంధించి స్మాల్‌క్యాప్‌ విభాగం ఒక్కటీ భిన్నంగా ఉంది.  అన్ని పేరున్న స్మాల్‌క్యాప్‌ యాక్టివ్‌ పథకాలు సూచీలకంటే అధిక రాబడులిస్తున్నాయి. అంతేకాదు, అస్థిరతలూ తక్కువగా ఉంటున్నాయి. అధిక రిస్క్‌ భరించగలిగేవారు స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఇండెక్స్‌ ఫండ్స్‌కు బదులు  యాక్టివ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. వీటిలో ఎస్‌బీఐ, యాక్సిస్, నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మంచి పనితీరు చూపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు