వేదాంత డైరీస్‌ 6: ఛాయ్‌, పల్లిపట్టితోనే కడుపు నింపుకున్నాడు.. నేడు 30 వేల కోట్లకు అధిపతి

2 Jun, 2022 20:44 IST|Sakshi

చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంగ్లీష్‌ ఒక్క ముక్క రాకుండా ముంబైకి చేరుకోవడం దగ్గరి నుంచి టెలిఫోన్‌ కేబుళ్ల తయారీకి అవసరమైన మిషనరీ సంపాదించిన వరకు విషయలు ఇప్పటి వరకు మనతో ఆయన పంచుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలను ట్విటర్‌ ద్వారా మరోసారి మనతో పంచుకున్నారు.

ఉదయం అంతా కేబుళ్ల అమ్మకాలకు సంబంధించి లావాదేవీలు రాత్రయితే చాలు కేబుళ్లకు అవసరమైన రాగి తీగ తయారీ యూనిట్‌ కార్మికులతో మంతనాలు. ఇలా కాలంతో పరిగెడుతూ 24 గంటలు పని చేశారు వేదాంత గ్రూప్‌ సీఈవో అనిల్‌ అగర్వాల్‌. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరి జీవితానికి పనికి వచ్చే ఎన్నో గొప్ప విషయాలను ఆయన స్వయంగా అనుభవించారు. 

కాలంతో పరుగులు
దేశవ్యాప్తంగా టెలిఫోన్‌ కేబుళ్లను సరఫరా చేసేందుకు మెరైన్‌లైన్‌లో చిన్న ఆఫీస్‌ను అప్పటికే తెరిచారు అనిల్‌ అగర్వాల్‌. అమెరికా నుంచి తెప్పించిన మిషనరీతో దూరంగా లోనావాలో మొదటి కాపర్‌రాడ్స్‌ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మెరైనలైన్‌లో పని చేసిన అనంతరం లోకల్‌ ట్రైన్‌ పట్టుకుని లోనావాలాకు బయల్దేరి వెళ్లేవారు అనిల్‌ అగర్వాల్‌.

నిద్రకు సమయం లేదు
లోకల్‌ ట్రైన్‌లో లోనావాలా చేరుకున్న తర్వాత రాత్రంతా కార్మికులతో మాట్లాడుతూ ఉండేవారు. కాపర్‌ తయారీకి సంబంధించిన విషయలను స్వయంగా పరిశీలిస్తూ కార్మికులను ఉత్సాహపరుస్తూ రాత్రంతా అక్కడే తిగిరే వారు. తెల్లవారడం ఆలస్యం మళ్లీ లోకల్‌ ట్రైన్‌లో లోనావాల నుంచి మెరైన్‌లైన్‌కి చేరుకునేవాడు. ఈ క్రమంలో నిద్రపోవడానికి, తినడానికి సమయం దొరక్క రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై దొరికే కడక్‌ ఛాయ్‌, పల్లీ పట్టిలీతోనే కడుపు నింపుకునేవాడినంటున్నారు అనిల్‌ అగర్వాల్‌. పని మీద అమితమైన ఉత్సాహం ఉండటం వల్ల నిద్ర లేకపోయినా తిండి తినకపోయినా ఎటువంటి అలసట కనిపించేది కాదంటున్నారు. 

ప్రతీరోజు విమానంలోనే
కాపర్‌ వైర్‌ పరిశ్రమ నిలదొక్కుకోవడంతో ఆ తర్వాత కాపర్‌ స్మెల్టర్‌ పరిశ్రమ ఏర్పాటు వైపు  అనిల్‌ అగర్వాల్‌ కన్ను పడింది. అంతే కాపర్‌ స్మెల్టర్‌ పరిశ్రమ స్థాపించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిధుల సమీకరణ కోసం ఏడాదిలో మూడు వందల రోజులు విమాన ప్రయాణాలే చేయాల్సి వచ్చింది అనిల్‌ అగర్వాల్‌. అంత బిజీ షెడ్యూల్‌లో కనీసం విమానంలో కూడా నిద్ర వచ్చేది కాదట అనిల్‌కి. తన దగ్గరున్న వనరులు, తాను కంటున్న కలలకు పొంతన లేకపోయినా ఏదో ఒక రోజు తాను అనుకున్నది సాధిస్తాననే ఊహ తనకు కుదురుగా నిద్ర పట్టనిచ్చేది కాదంటున్నాడీ బిజినెస్‌ మ్యాగ్నెట్‌.

అక్కడే సంతృప్తి దొరికింది
అలుపెరుగని శ్రమ, మొక్కవోని అంకుఠ దీక్ష ఫలించి బ్యాంకు రుణాలు, పబ్లిక్‌ ఆఫరింగ్‌ల ద్వారా కాపర్‌ మెల్టింగ్‌ పరిశ్రమ స్థాపనకు అవసరమైన రూ. 600 కోట్ల నిధులను సమీకరించగలిగాడు అనిల్‌ అగర్వాల్‌. అయితే చేతిలో చిల్లీగవ్వ లేని స్థాయి నుంచి రూ.600 కోట్ల నిధులు సమీకరించడం కంటే కాపర్‌ పరిశ్రమ స్థాపన ద్వారా ఏకంగా 24,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలగడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నాడు అనిల్‌ అగర్వాల్‌. అంతేకాదు ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 వేల టన్నుల నుంచి నాలుగు లక్షల టన్నులకు చేరుకుందంటూ గర్వంగా చెప్పారు అనిల్‌.

రూపురేఖలు మారిపోతాయ్‌
గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు చాలా బాగా ఉన్నాయంటున్నాడు అనిల్‌ అగర్వాల్‌, స్టార్టప్‌ కల్చర్‌ విస్తరించింది. కొత్త కొత్త ఎంట్రప్యూనర్లు పుట్టుకొస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారాయన. మీరంతా మీ లక్ష్యాల దిశగా పట్టుదలతో శ్రమిస్తే పెట్టుబడులు అవే వస్తాయంటూ యంగ్‌ ఎంట్రప్యూనర్లకు ఆయన సూచించారు. ఆ పెట్టుబడులు సద్వినియోగం అయితే దేశ రూపురేఖలే మారిపోతాయంటూ భవిష్యత్‌ బంగారు భారత్‌ని దర్శిస్తున్నారయన. అందుకే మీరు ఎంత ఎత్తుకు వెళ్లాలని అనుకుంటే అంత ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించండి అంటూ యంగ్‌ ఎంట్రప్యూనర్లకు సూచిస్తున్నారు.

చదవండి: వేదాంత డైరీస్‌ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం

చదవండి: వేదాంత డైరీస్‌ 5: ఏ రిస్క్‌ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్‌

మరిన్ని వార్తలు