వేదాంత డైరీస్‌ 4: వ్యాపారంలో లెక్కలొక్కటే సరిపోవు.. మనసులు గెలవడమే ముఖ్యం

18 Apr, 2022 20:12 IST|Sakshi

వ్యాపారంలో విజయం సాధించాలంటే విజన్‌ ఉండటం ఉండటం దానికి తగ్గ పెట్టుబడి సాధించడం. ఆ రెండు వచ్చిన తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కోవడం, అవకాశాలను ఒడిసిపట్టుకోవడం వంటి అంశాలను ఇప్పటి వరకు వివరించారు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌. తాజాగా వ్యాపారానికి సంబంధించిన మరో మెళకువను ఆయన వివరించారు. 

అమెరికాలో ప్రయత్నాలు
టెలిఫోన్‌ కేబుళ్ల తయారీకి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నా షంషేర్‌ కేబుల్‌ తయారీ పరిశ్రమకు అవసరమైన మిషనరీ కోసం వెంటనే అమెరికాకు వెళ్లాను.  అక్కడే ఉంటూ కేబుల్‌ తయారీ పరిశ్రమతో సంబంధం ఉన్నవారితో ప్రతీ రోజు 40 నుంచి 50 మందితో ఫోన్‌లో మాట్లాడుతుండే వాడిని. ఈ క్రమంలో  ఎస్సెక్స్‌లో ఉన్న జెల్లీ ఫిల్ల్‌డ్‌ కంపెనీ గురించి తెలిసింది. ఆ కంపెనీకి అమెరికాలో అనేక ప్లాంట్లు ఉన్నాయి. ఇటీవల ఆ కంపెనీకి చెందిన ఎస్సెక్స్‌ ప్లాంటును మూసివేసినట్టు తెలిసింది. దీంతో ఈ కంపెనీ ప్రతినిధులను కలిసేందుకు విశ్వప్రయత్నం చేశాను. కానీ అపాయింట్‌మెంట్‌ దొరక్క పోవడంతో తిరిగి ఇండియా వచ్చేశాను. 

అవకాశం దొరికింది
ఇక్కడ ఇండియాలో ఎక్విప్‌మెంట్‌ కొరత కారణంగా ఒక టెలిఫోన్‌ కనెక‌్షన్‌ పొందడానికి 8 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన రోజులవీ. ఒక్కసారి కేబుళ్లు తయారీ మొదలు పెడితే క్షణాల మీద అమ్ముడైపోతాయని తెలుసు. కానీ అందుకు తగ్గ మెషినరీ సమకూర్చుకోవడం కష్టమైపోతుంది. ఇండియాలో ఆ మెషినరీ లేదు. అమెరికా వాళ్లు మనకు దొరకరు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించడంతో రెండేళ్ల తర్వాత జెల్లీ ఫిల్ల్‌డ్‌ కంపెనీ సీఈవోల మాట్లాడే అవకాశం దొరికింది.

ఎలాగైన డీల్‌ కుదరాలి
నాకు బాగా పరిచయం ఉన్న ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ నారాయణ స్వామిని వెంట తీసుకుని అమెరికా ఫ్లైట్‌ ఎక్కాను. నారాయణ స్వామి కంపెనీ లావాదేవీలు నిర్వహించడంలో దిట్ట. మేమిద్దరం కలిసి ఆ కంపెనీ ప్రతినిధులను ఒప్పించగలమని నమ్మాం. వాళ్ల నుంచి పిలుపు కోసం అమెరికాలో ఎదురు చూస్తూ గడిపాం. ఈ సమయంలో డబ్బులు ఆదా చేసేందుకు ఇద్దరం ఒకే రూమ్‌ షేర్‌ చేసుకునే వాళ్లం. రోడ్డు పక్కన శాండ్‌విచెస్‌ లాంటి స్ట్రీట్‌ఫుడ్‌తో కడుపు నింపుకునే వాళ్లం. 

కరిగిపోయిన కలలు
మా నిరీక్షణ ఫలించి ఒక రోజున జెల్లీ ఫిల్ల్‌డ్‌ కంపెనీ సీఈవో ఫ్రెడ్‌ జింజర్‌, సీఎఫ్‌వో క్రిస్‌రాడ్‌లను కలుసుకున్నాం. మేము చెప్పినదంతా విన్న తర్వాత .. మూతపడిన ప్లాంట్‌కి సంబంధించి ఎక్విప్‌మెంట్‌ అమ్మే ఉద్దేశం తమకు లేదంటూ తాపీగా చెప్పారు వాళ్లిద్దరు. దీంతో అప్పటి కళ్ల ముందు కదలాడిన అందమైక కల కరిగిపోయింది.

లెక్కలొక్కటే సరిపోవు
అప్పటికే వ్యాపారంలో పదేళ్లపాటు తింటున్న డక్కామెక్కీలు నేర్పిన విలువైన పాఠం ఆ సమయంలో నాకు గుర్తుకు వచ్చింది. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధించాలంటే లెక్కలు ఒక్కటే సరిపోవని, ఎదుటివారి మనసు గెలుచుకోవాలని ఆ తర్వాతే డీల్‌ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అందుకే  వెంటనే ఇండియాలో ఉన్న నా కుటుంబాన్ని కూడా అమెరికాకు రప్పించుకున్నాను. 

పట్టువదల్లేదు
అమెరికాలో ఉండగానే నా కూతురు ప్రియ పుట్టింది. మిల్క్‌, డైపర్స్‌, వ్యాక్సినేషన్స్‌ ఇలా బేబీ మెయింటనెన్స్‌కి సరిపడా డబ్బులు కూడా లేని రోజులవి. నా భార్య, నా తల్లిదండ్రులు అందించిన సహాకారంతోనే ఈ బాధలన్నీ తీరిపోయాయి. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే. అందుకే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా అమెరికాలోనే ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా జెల్లీఫిల్ల్‌డ్‌ కంపెనీ ప్రతినిధులను కలుస్తుండే వాడిని. ఇలా కలిసినప్పుడు వ్యాపార విషయాలు కాకుండా.. ఫిలాసఫీ, పర్సనల్‌ విషయాలు, ఇండియాలో పారిశ్రామిక రంగం, వ్యాపారంలో నేను సాధించాలనుకుంటున్న లక్ష్యాలు, పదేళ్లుగా నేను పడుతున్న ఇబ్బందులు, పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ వారిలో ఒకడిలా మారిపోయాను. వ్యాపార విషయాలు పక్కన పెట్టి సాధారణ విషయాలు మాట్లాడుతూ వారికి దగ్గరయ్యేందుకు, వారి మనసు గెలిచేందుకు ప్రయత్నించాను. 

మేమున్నాం
ఇలా కొంత కాలం మా మధ్య స్నేహం ముదిరి పాకన పడిన తర్వాత వాళ్లకు నా వ్యాపార లక్ష్యాలు పూర్తిగా అర్థమయ్యాయి. దీంతో మెషినరీ అమ్మకూడదనే వాళ్ల నిర్ణయం మార్చుకోవడమే కాదు. ఆ మెషినరీ నాకు తక్కువ ధరకే అందివ్వడంతో పాటు ఇండియాలో ఎస్టాబ్లిష్‌ జరిగేంత వరకు సహాకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు. 

మనసు పెట్టి పని చేస్తే
ఏదైనా సాధించాలనే కోరిక గట్టిగా ఉన్నప్పుడు..  అంకిత భావంతో మనసుపెట్టి పని చేస్తే ఎంత కఠిన లక్ష్యమైనా కరిగిపోయి చేతికి అందివస్తుందని ఈ అనుభవం నాకు తెలిపింది. లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రతికూల ఫలితాలు ఎదురైనా ఆశ కోల్పోకుండా మనసు పెట్టి పని చేస్తే కచ్చితంగా ఓ రోజు గమ్యాన్ని చేరుకుంటాం. అలా కేబుల్‌ పరిశ్రమ మెషినరీ కోసం 1986లో మొదలు పెట్టిన ప​‍్రయత్నాలు 1989లో దారికొచ్చాయి. (ఐపోలేదింకా)

చదవండి: వేదాంత డైరీస్‌: ఇంగ్లీష్‌ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి

చదవండి: వేదాంత డైరీస్‌ 2: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది

చదవండి: వేదాంత డైరీస్‌ : న్యూయార్క్‌లో జేబుదొంగలు !

మరిన్ని వార్తలు