రూ.11వేల పెట్టుబడులకు వేదాంతా సై, ఎందులో అంటే?

26 Mar, 2022 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: వివిధ విభాగాలపై 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ప్రైవేట్‌ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, జింక్, స్టీల్‌ బిజినెస్‌లపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. 

శుక్రవారం(25న) జరిగిన బోర్డు సమావేశంలో ఇంధన విభాగం కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌పై 68.7 కోట్ల డాలర్లను వ్యయపరచనున్నట్లు తెలియజేసింది. వీటిలో 36 కోట్ల డాలర్లను మంగళ, భాగ్యమ్, ఐశ్వర్య బార్మెర్‌ హిల్, రవ్వ క్షేత్రాలపై వెచ్చించనున్నట్లు పేర్కొంది. కొత్త బావులలో తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది.

దక్షిణాఫ్రికాలోని గ్యామ్స్‌బర్గ్‌ జింక్‌ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ కోసం 46.6 కోట్ల డాలర్లు వినియోగించనున్నట్లు వెల్లడించింది. వార్షిక సామర్థ్యాన్ని రెట్టింపునకు అంటే 8 మిలియన్‌ టన్నులకు చేర్చనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఏడాదికి 2 లక్షల మిక్‌ జింక్‌ను అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు వివరించింది. ఈ బాటలో 34.8 కోట్ల డాలర్లను స్టీల్‌ బిజినెస్‌ విస్తరణకు కేటాయించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కోక్‌ ఒవెన్స్‌కు దన్నుగా అదనపు బ్లాస్ట్‌ఫర్నేస్‌ ఏర్పాటు, పెల్లెట్, ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు