vedanta:తగ్గేదెలే అంటున్న వేదాంత: వేల కోట్ల పెట్టుబడులు

25 Aug, 2022 15:13 IST|Sakshi

పెట్టుబడులు కొనసాగిస్తాం: వేదాంత

న్యూఢిల్లీ: మెటల్‌ ధరలు క్షీణిస్తున్నప్పటికీ ఈ ఏడాది పెట్టుబడి వ్యయాలకు కోత పెట్టబోమంటూ వేదాంతా లిమిటెడ్‌ స్పష్టం చేసింది. జింక్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, అల్యూమినియం వ్యాపారాల్లో భారీ ప్రణాళికల్లో ఉంది. 2022-23లో 2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు) వెచ్చించ నున్నట్లు వేదాంత తెలియజేసింది.

జింక్, చమురు-గ్యాస్, అల్యూమినియం వ్యాపారంలో నిధులను వినియోగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టులకు మధ్యలో ఫుల్‌స్టాప్‌ పెట్టబోమని కంపెనీ సీఈవో సునీల్‌ దుగ్గల్‌ వెల్లడించారు. వీటితో పటిష్ట రిటర్నులు లభిస్తాయన్నారు. తద్వారా నిర్వహణా సామర్థ్యం మరింత మెరుగుపడటంతోపాటు, ఉత్పాదకత పుంజు కుంటుందన్నారు.

దేశీ మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ పరిశ్రమపై ఎన్‌ఎండీసీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు రెండో రోజు దుగ్గల్‌ విలేకరులకు ఈ విషయాలు వెల్లడించారు.  రాబోయే రెండేళ్లలో సుమారు  3 బిలియన్ల డాలర్లు మూలధనాన్ని వెచ్చించ నున్నట్టు  వేదాంత  57వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) నుంచి మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటైన ఫాక్స్‌కాన్‌తో వేదాంత ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రెండులక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్  అనుబంధ సంస్థ  వేదాంత లిమిటెడ్, దేశం అంతటా చమురు, గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు,య అల్యూమినియం, పవర్‌  వ్యాపార నిర్వహణలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది.   

మరిన్ని వార్తలు