స్టార్టప్‌లకు జోరుగా వెంచర్‌ క్యాపిటల్‌ నిధులు

21 Aug, 2021 01:01 IST|Sakshi

16.9 బిలియన్‌ డాలర్ల సమీకరణ

ఈ ఏడాది తొలి 6 నెలల గణాంకాలు

న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు (ఆరంభ దశలోని కంపెనీలు) వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) నిధులు అండగా నిలుస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు 16.9 బిలియన్‌ డాలర్ల (రూ.1.26 లక్షల కోట్లు సుమారు) నిధులను భారత స్టార్టప్‌లు సమీకరించాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ.. వీసీ ఇన్వెస్టర్లు భారత స్టార్టప్‌ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ‘గ్లోబల్‌ డేటా’ అనే డేటా అనలైటిక్స్‌ సంస్థ తెలిపింది. నిధుల సమీకరణలో భారత స్టార్టప్‌లు చైనా స్టార్టప్‌ల సరసనే నిలుస్తున్నట్టు పేర్కొంది.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 828 వీసీ ఫండింగ్‌ (పెట్టుబడులు) ఒప్పందాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాల విలువ 16.9 బిలియన్‌ డాలర్లు. వీటిల్లో ఫ్లిప్‌కార్ట్‌ 3.6 బిలియన్‌ డాలర్లు, మొహల్లా టెక్‌ (షేర్‌చాట్‌) 502 మిలియన్‌ డాలర్లు, జొమాటో 500 మిలియన్‌ డాలర్లు, థింక్‌ అండ్‌ లెర్న్‌ (బైజూస్‌) 460 మిలియన్‌ డాలర్ల సమీకరణ పెద్ద ఒప్పందాలుగా ఉన్నాయి. భారత్‌లో వీసీ ఫండింగ్‌ ఒప్పందాల సంఖ్య క్షీణించినా కానీ, విలువ పరంగా వృద్ధి నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు