దేశీ స్టార్టప్స్‌లోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు

25 Jan, 2023 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్‌లోకి వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు గతేడాది 38 శాతం క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితి, మార్కెట్‌ ఒడిదుడుకుల వల్ల నిధుల సమీకరణ, పెట్టుబడుల కార్యకలాపాలపై ప్రభావం పడటమే ఇందుకు కారణం. 

డేటా అనలిటిక్స్‌ సంస్థ గ్లోబల్‌డేటా విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021లో 33.8 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 1,715 డీల్స్‌ కుదరగా 2022లో 1,726 ఒప్పందాలు కుదిరినా పెట్టుబడుల పరిమాణం 20.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.  

టాప్‌ 4 మార్కెట్లలో భారత్‌.. 
వీసీ పెట్టుబడుల పరిమాణం, విలువపరంగా చైనా తర్వాత ఆసియా–పసిఫిక్‌ దేశాల్లో భారత్‌ కీలక మార్కెట్‌గా ఉందని గ్లోబల్‌డేటా లీడ్‌ అనలిస్ట్‌ అరోజ్యోతి బోస్‌ తెలిపారు. 
అంతర్జాతీయంగా టాప్‌ 4 మార్కెట్లలో (అమెరికా, బ్రిటన్, చైనా, భారత్‌) ఒకటిగా ఉందని పేర్కొన్నారు. 2022లో అంతర్జాతీయంగా వీసీ ఫండింగ్‌లో విలువపరంగా 5.1 శాతం, పరిమాణంపరంగా 6.3 శాతం మేర భారత్‌ వాటా దక్కించుకుంది.

అమెరికా, బ్రిటన్, చైనాలో 2022లో డీల్స్‌ పరిమాణం క్షీణించగా భారత్‌ మాత్రం 0.6 శాతం వృద్ధితో ప్రత్యేకంగా నిల్చింది. గ్లోబల్‌డేటా ప్రకారం 2021లో వీసీ ఫండింగ్‌ డీల్‌ సగటు విలువ 19.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2022లో 12.1 మిలియన్‌ డాలర్లకు తగ్గింది. 

అలాగే 100 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య 2021లో 86గా ఉండగా గతేడాది 42కి తగ్గింది. ఇన్వెస్టర్లకు గణనీయంగా రాబడులు ఇవ్వగలిగే కంపెనీల కొరత కూడా వీసీ పెట్టుబడుల తగ్గుదలకు కారణమైందని బోస్‌ వివరించారు. వర్ధమాన దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, భారత్‌ ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు