భారత్‌లో టెక్‌ పెట్టుబడులు భేష్‌

15 Jan, 2022 05:50 IST|Sakshi

గతేడాది రికార్డు స్థాయిలో వీసీ ఇన్వెస్ట్‌మెంట్లు

మూడు రెట్లు పెరిగి 44.6 బిలియన్‌ డాలర్లకు చేరిక

టాప్‌ దేశాల్లో మూడో స్థానానికి ఇండియా

లండన్‌: వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ (వీసీ) పెట్టుబడులపరంగా దేశీ టెక్నాలజీ రంగానికి గతేడాది జోరుగా సాగింది. 2020లో నమోదైన 14.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 2021లో దాదాపు మూడు రెట్లు పెరిగి 44.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా అంతర్జాతీయంగా భారీగా వీసీ పెట్టుబడులు ఆకర్షించిన దేశాల జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.

లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వీసీ పెట్టుబడులు 675 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. అత్యధికంగా 328.8 బిలియన్‌ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 61.8 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 39.8 బిలియన్‌ డాలర్లతో బ్రిటన్‌ నాలుగో స్థానాల్లో నిల్చాయి.  

నగరాలవారీగా బెంగళూరు టాప్‌..
దేశీయంగా అత్యధికంగా వీసీ పెట్టుబడులు ఆకర్షించిన నగరంగా బెంగళూరు టాప్‌లో ఉంది. 18.6 బిలియన్‌ డాలర్లు దక్కించుకుంది. తద్వారా ప్రపంచంలో టాప్‌ నగరాల జాబితాలో అయిదో స్థానంలో నిల్చింది. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియా (101 బిలియన్‌ డాలర్లు), న్యూయార్క్‌ (47.5 బిలియన్‌ డాలర్లు), గ్రేటర్‌ బోస్టన్‌ రీజియన్‌ (30 బిలియన్‌ డాలర్లు), లండన్‌ (25.5 బిలియన్‌ డాలర్లు) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక యూనికార్న్‌లపరంగా కూడా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.

మొత్తం 16 కొత్త యూనికార్న్‌లకు కేంద్రంగా నిల్చింది. ‘బ్రిటన్, భారత్‌లో రికార్డు స్థాయి వీసీ పెట్టుబడుల గణాంకాలు .. ఈ రెండు దేశాల టెక్నాలజీ, నవకల్పనల సామర్థ్యాలపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. యూనికార్న్‌లు, టెక్‌ స్టార్టప్‌లపరంగా ఇన్వెస్ట్‌ చేయడానికి అత్యుత్తమమైన అతికొద్ది నగరాల జాబితాలో లండన్, బెంగళూరు మొదలైన వాటిని వీసీలు పరిగణిస్తున్నారు‘ అని లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ భారత విభాగం కంట్రీ డైరెక్టర్‌ హేమిన్‌ భరూచా తెలిపారు. 

మరిన్ని వార్తలు