యాహూ మరోసారి అమ్మకం...! డీల్‌ విలువ ఎంతో తెలుసా..!

4 May, 2021 14:41 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇంటర్నెట్‌ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్‌ మరోసారి చేతులు మారుతున్నాయి. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ వీటిని అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు విక్రయించనుంది. ఈ డీల్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లుగా ఉండనున్నట్లు అంచనా మార్కెటు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాహూ, ఏవోఎల్‌తో కూడిన వెరిజోన్‌ మీడియాను 5 బిలియన్‌ డాలర్లకు విక్రయిస్తున్నట్లు వెరిజోన్‌ వెల్లడించింది. ఈ డీల్‌ ప్రకారం వెరిజోన్‌కి 4.25 బిలియన్‌ డాలర్లు నగదు రూపంలోను, మిగతాది మైనారిటీ వాటాల రూపంలో లభించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా.

ఒకప్పుడు ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా యాహూ వెలుగొందిన సంగతి తెలిసిందే.  అలాగే ఏవోఎల్‌ పోర్టల్‌ కూడా యూజర్లను ఆకర్షించింది. గూగుల్‌ తదితర టెక్‌ దిగ్గజాల ప్రాచుర్యం పెరిగే కొద్దీ వీటి ప్రభావం తగ్గిపోయింది. మొబైల్‌ మార్కెట్లోకి వేగంగా విస్తరించవచ్చనే ఉద్దేశంతో 2015లో ఏవోఎల్‌ను 4 బిలియన్‌ డాలర్లు వెచ్చించి వెరిజోన్‌ కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అంతకు మించి వెచ్చించి యాహూను దక్కించుకుంది. అయితే, వేగంగా వృద్ధి చెందిన గూగుల్, ఫేస్‌బుక్‌ సంస్థలు.. వెరిజోన్‌ ఆశలపై నీళ్లు జల్లాయి. తాను ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో వీటిపై చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను వెంటనే నిలుపివేయగా చేసిన వెరిజోన్‌.. తాజాగా అమ్మేయాలని నిర్ణయించుకుంది.   

చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్‌ గేట్స్‌

మరిన్ని వార్తలు