సైబర్‌ నేరాలపై కీలక విషయాలను వెల్లడించిన వెరిజోన్‌ నివేదిక...!

26 May, 2021 00:53 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని వెరిజోన్‌ బిజినెస్‌ గ్రూప్‌ ఒక నివేదికలో పేర్కొంది. డేటా చౌర్యానికి సంబంధించి 2021 నివేదిక ప్రకారం ఫిషింగ్‌ దాడులు 11 శాతం, ర్యాన్‌సమ్‌వేర్‌ దాడులు ఆరు శాతం పెరిగాయి. సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు కొంగొత్త డిజిటల్‌ టెక్నాలజీలకు చాలా వేగంగా మారుతున్నారు. సుమారు 29,207 ఉదంతాలను విశ్లేషించగా.. 5,258 కేసుల్లో రూఢీగా డేటా చౌర్యం జరిగినట్లు నివేదిక పేర్కొంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎక్కువగా హెల్త్‌కేర్, ఫార్మా రంగాలను లక్ష్యంగా ఎంచుకుని మేథోహక్కుల చౌర్యం మొదలైన వాటికి పాల్పడుతున్నారని మంగళవారం ఒక కార్యక్రమంలో వెరిజోన్‌ బిజినెస్‌ గ్రూప్‌ ఆగ్నేయాసియా, భారత విభాగం హెడ్‌ ప్రశాంత్‌ గుప్తా తెలిపారు. డేటా చౌర్యం కారణంగా వ్యాపార వర్గాలకు సగటున 21,659 డాలర్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 95 శాతం సందర్భాల్లో నష్టం సుమారు 826 డాలర్ల నుంచి 6,53,587 డాలర్ల దాకా ఉందని ఉందని వివరించారు.  కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం కిషన్‌ రెడ్డి, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మ్యాన్, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ సెక్యూరిటీ క్లస్టర్‌ ఈ నివేదిక రూపకల్పనలో సహకారం అందించాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు