-

ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా

21 Jul, 2021 08:14 IST|Sakshi

ముంబై: దేశీయంగా ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు జున్‌లో 5.4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్‌లో నమోదైన 6.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 22 శాతం క్షీణించాయి. అయితే, సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది మే నెలలో వచ్చిన 4 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ లాబీ గ్రూప్‌ ఐవీసీఏ రూపొందించిన నెలవారీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు, గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో పీఈ/వీసీ పెట్టుబడులు 45 శాతం పెరిగి 26.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ‘దేశీయంగా పీఈ/వీసీ పెట్టుబడుల కార్యకలాపాలు 2021 ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో పెరిగాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుంది. ప్రథమార్ధం, రెండో త్రైమాసికంలో పీఈ/వీసీ పెట్టుబడులు గరిష్ట స్థాయిలో వచ్చాయి‘ అని ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌ సోని తెలిపారు. భారీ డీల్స్‌ (100 మిలియన్‌ డాలర్ల పైబడినవి), మధ్య స్థాయి డీల్స్‌ (20–100 మిలియన్‌ డాలర్ల దాకా)పై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని ఆయన పేర్కొన్నారు.  

టెక్నాలజీ,ఈ–కామర్స్‌ ఫేవరెట్స్‌.. 
రంగాలవారీగా చూస్తే టెక్నాలజీ, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు, ఫార్మా, విద్య, మీడియా.. వినోద రంగాల్లో పెట్టుబడుల ధోరణి సానుకూలంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆయా రంగాలు కోవిడ్‌ వల్ల పుంజుకోవడమో లేదా మహమ్మారి ప్రభావాల నుంచి వేగంగా కోలుకోవడమో ఇందుకు కారణం కావచ్చని వివరించింది. అటు ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్, రిటైల్, కన్జూమర్‌ ఉత్పత్తుల విభాగాల్లో పీఈ/వీసీ పెట్టుబడులు కాస్త తగ్గినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 3.6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 12 ఒప్పందాలు కుదిరాయి. గతేడాది జూన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సహా 6.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు 11 నమోదయ్యాయి. కొను గోళ్లకు సంబంధించి 1.9 బిలియన్‌ డాలర్ల విలువ చేసే అయిదు డీల్స్‌ కుదిరాయి.     

చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం,పెట్రో ధరలపై ఆఫర్లు డిస్కౌంట్లు

మరిన్ని వార్తలు