బ్యాంకులకు ‘వీడియోకాన్‌’ లో 8 శాతం వాటాలు

23 Jun, 2021 07:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన వీడియోకాన్‌ గ్రూప్‌లోని 11 అనుబంధ కంపెనీల విలీనంతో ఏర్పడే సంస్థలో ఆర్థిక రుణదాతలకు 8 శాతం వాటా లభించనుంది. వీడియోకాన్‌ కొనుగోలు కోసం  ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం.. లిస్టెడ్‌ కంపెనీలైన వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ (వీఐఎల్‌), వేల్యూస్‌ ఇండస్ట్రీస్‌ (వీఏఐఎల్‌)ను డీలిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత వీఏఐఎల్‌ సహా గ్రూప్‌లోని 11 సంస్థలను వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. అయితే, వీడియోకాన్‌ టెలికం మాత్రం అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. వీఐఎల్‌ మొత్తం షేర్లలో 8 శాతాన్ని రుణదాతలకు నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. వీఐఎల్, వీఏఐఎల్‌ డీలిస్టింగ్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, వీడియోకాన్‌ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో డీలిస్టింగ్‌కు సంబంధించి ఈ రెండు సంస్థల షేర్‌హోల్డర్లకు దక్కేదేమీ లేదు. వీడియోకాన్‌ టేకోవర్‌కు మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కి చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ సమర్పించిన రూ. 2,962 కోట్ల ప్రణాళికకు జూన్‌ 9న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.  

చదవండి: తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి

మరిన్ని వార్తలు