వీడియోకాన్‌ కొనుగోలుపై వేదాంతాకు బ్రేక్స్‌! 

21 Sep, 2021 04:12 IST|Sakshi

క్రెడిటార్స్‌ కమిటీ ‘యూ’ టర్న్‌

కొత్త బిడ్స్‌ను కోరుతూ ఎన్‌సీఎల్‌ఏటీలో పిటిషన్‌

27న  విచారణ

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ను అతి తక్కువకు సొంతం చేసుకోవాలన్న వేదాంతా గ్రూప్‌ అనుబంధ కంపెనీ ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ ప్రణాళికలు ఫలించేట్లు కనబడ్డం లేదు.  ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్‌ కమిటీ (సీఓసీ) తాజాగా యూ టర్న్‌ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్‌ గ్రూప్‌ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్‌ కమిటీ దివాలా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది.

ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా  క్రెడిటార్స్‌ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్‌ డ్యూరబుల్‌ సంస్థ వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలుకు ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ దాఖలుచేసిన రిజల్యూషన్‌ బిడ్‌ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే  తాజా బిడ్స్‌ కోరడానికి కారణమని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఈ నెల 27న జస్టిస్‌ జరాత్‌ కుమార్‌ జైన్, జస్టిస్‌ కాంతి నరహరి నేతృత్వంలోని బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టి, తగిన ఉత్తర్వులు ఇవ్వనుంది.

అప్పటికల్లా తన సమాధానం తెలియజేయడానికి బెంచ్‌ ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ అనుమతి ఇచ్చింది. వీడియోకాన్‌ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్‌ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్‌ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్‌బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్‌బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం.

జరిగింది ఇదీ... 
ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌  రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్‌ 9న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్‌ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. బిడ్డింగ్‌ విషయంలో తమ పునరాలోచనకు ఆయా పరిణామాలు, వ్యాఖ్యలు, ఈ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు  కూడా కారణమని తాజాగా ఎస్‌బీఐ నేతృత్వంలోని క్రెడిటార్స్‌ కమిటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

ఈ రిజల్యూషన్‌ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐఎఫ్‌సీఐ లిమిటెడ్‌లు కూడా జూన్‌ 19నే అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే  అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే ఎత్తివేయాలని కోరుతూ  ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఆగస్టు 13న ట్విన్‌స్టార్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.  తన రిజల్యూషన్‌ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్‌ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్‌ టెక్నాలజీస్‌ వాదన. కాగా   తమ గ్రూప్‌ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ వేణగోపాల్‌ ధూత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణకు స్వీకరించింది. 

దివాలా కోడ్‌పై విమర్శల తీరిది
రిజల్యూషన్‌ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్‌ ప్రక్రియలో  క్రెడిటార్స్‌ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్‌) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి  క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్‌ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)  దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో  ఆర్థికశాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్లతో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి రాజేష్‌ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్‌ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు