పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను వీడని కష్టాలు..!

20 Feb, 2022 15:03 IST|Sakshi

ఐపీఓ లిస్టింగ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో అదరగొట్టిన కొత్త తరం టెక్ కంపెనీలు, ప్రస్తుతం చతికలపడుతున్నాయి. ఈ  కంపెనీల బ్రాండ్‌‌‌‌ను చూసో లేదా బిజినెస్‌‌‌‌ మోడల్‌‌‌‌ను చూసో వెంట పడిన ఇన్వెస్టర్లు, తాజాగా ఈ షేర్లను వదిలించుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో, పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 18న ఐపీఓకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఐపీఓకు వచ్చిన నాటి నుంచి షేర్ ధర పడిపోతూ వస్తూనే ఉంది.  స్టాక్ మార్కెట్లలో పేటీఎమ్ జాబితా చేసినప్పటి నుంచి సీఈవో విజయ్ శేఖర్ శర్మ రోజుకు సగటున రూ.128 కోట్లు కోల్పోయారు. 

పేటీఎమ్ ప్రతి షేరు ఐపీఓ ప్రారంభ ధర రూ.2150. అయితే, 3 నెలల తర్వాత ప్రతి షేరు షేర్ ధర ఇప్పుడు రూ.833 విలువతో ట్రేడ్ అవుతుంది. దీని అర్థం, కంపెనీలో దాదాపు 14 శాతం వాటా కలిగి ఉన్న విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సంపద చివరి మూడు నెలల్లో 1.59 బిలియన్ డాలర్లు క్షీణించింది. అంటే, రోజుకు లెక్కిస్తే రూ.128 కోట్ల సంపద నష్ట పోయారు. పేటీఎమ్ స్టాక్ ధర రోజు రోజుకి భారీగా పడిపోతుంది. ఐపీఓ సమయంలో పేటిఎమ్ లో శర్మ వాటా సుమారు $2.6 బిలియన్లు ఉంటే, ఇప్పుడు అది కేవలం 998 మిలియన్ డాలర్లు. అయితే, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం శర్మ మొత్తం మీద 1.3 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. అతను పేటిఎమ్ కంపెనీలో 57.67 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు. పేటీఎమ్ మార్కెట్ క్యాప్‌‌‌‌ లిస్టింగ్ రోజు నుంచి చూస్తే  రూ.45,597 కోట్లు తగ్గింది. లిస్టింగ్ రోజు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌‌‌‌ ఏకంగా రూ.1,01,400 కోట్లకు చేరుకోగా,  ప్రస్తుతం రూ.55,802 కోట్లకు దిగొచ్చింది. 

(చదవండి: వచ్చేస్తున్నాడు.. డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..!)

మరిన్ని వార్తలు