విజయా డయాగ్నొస్టిక్‌ ఐపీవో @ రూ. 522–531

27 Aug, 2021 01:48 IST|Sakshi

సెప్టెంబర్‌ 1న ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెల్త్‌కేర్‌ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 1న ప్రారంభమై 3న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ఒక్కింటి ధర శ్రేణిని రూ. 522–531గా సంస్థ నిర్ణయించింది. కనీస బిడ్‌ లాట్‌ 28 షేర్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్‌ దాదాపు రూ. 1,895 కోట్లు సమీకరించనుంది.

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఉండే ఈ ఐపీవోలో ప్రమోటరు ఎస్‌ సురేంద్రనాథ్‌ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లయిన కారకోరం లిమిటెడ్, కేదార క్యాపిటల్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌–కేదార క్యాపిటల్‌ ఏఐఎఫ్‌ 1 దాదాపు 3.56 కోట్ల దాకా షేర్లను విక్రయించనున్నాయి. సురేంద్రనాథ్‌ రెడ్డి 50.98 లక్షల షేర్లు, కారకోరం 2.95 కోట్లు, కేదార క్యాపిటల్‌ 11.02 లక్షల షేర్లు విక్రయిస్తాయి. దీంతో ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటా 35 శాతం మేర తగ్గనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌నకు 59.78 శాతం, కారకోరం లిమిటెడ్‌కు 38.56 శాతం, కేదారకు 1.44 శాతం వాటాలు ఉన్నాయి.

విస్తరణ ప్రణాళికలు ..
ప్రస్తుతం తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు కోల్‌కతా, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో మొత్తం 80 పైచిలుకు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు ఉన్నాయని సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరించనున్నట్లు వివరించారు. దక్షిణాదిన హైదరాబాద్‌కి 4–5 గంటల ప్రయాణ దూరంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూర్పున కోల్‌కతా తదితర ప్రాంతాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు