మండే ఎండల్లో చల్లని ఆఫర్‌.. రూ.2కే కోన్‌ ఐస్‌క్రీం.. ఎక్కడంటే?

28 May, 2022 18:41 IST|Sakshi

నలువైపులా ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లచల్లని కోన్‌ ఐస్‌క్రీంని కేవలం రూ.2లకే అందిస్తోంది ఓ ఐస్‌క్రీం పార్లర్‌. దీంతో ఒక్కసారిగా ఈ పార్లర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడుంది ఈ పార్లర్‌, ఎందుకు అంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. క్వాలిటీ బాగుంటుందా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. 

తమిళనాడులో
చైన్నైలోని మాంబలం ఏరియాలో 1995లో వినూ ఇగ్లూ పేరుతో ఐస్‌క్రీం పార్లర్‌ ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఇక్కడ కోన్‌ ఐస్‌క్రీని కేవలం రెండు రూపాయలకే అమ్మారు. దీంతో ఆ పార్లర్‌ ఆ ఏరియాలో క్లిక్‌ అయ్యింది. తమ యూనిక్‌ సెల్లింగ్‌ పాయింట్‌ అదే కావడంతో ఐస్‌ క్రీం ధర మాత్రం మార్చలేదు. అయితే అనుకోని కారణాల వల్ల 2008లో ఈ పార్లర్‌ మూత పడింది. అక్కడి ప్రజలకు తక్కువ ధరకే నోరూరించే ఐస్‌క్రీం దూరమైంది.

రూ.2 చాలు మాకు
వినూ ఇగ్లూ ఐస్‌క్రీం పార్లర్‌ని 2022 ఫిబ్రవరిలో తిరిగి తెరిచాడు దాని యజమాని వినోద్‌. పాత కష్టమర్లకు ఆకట్టుకునేందుకు  ప్రారంభ ఆఫర్‌గా కోన్‌ ఐస్‌క్రీం ధర రూ.2గానే నిర్ణయించారు. కొద్ది రోజుల తర్వాత ధరను మార్కెట్‌కు అనుగుణంగా మార్చాలని అనుకున్నారు. కానీ రూ.2 కోన్‌ ఐస్‌క్రీం కొనేందుకు వస్తున్న పాత కొత్త కస్టమర్లు చూపిస్తున్న ప్రేమ. ఆనాడు తన తండ్రి ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం తమను ఎంతగా ఆకట్టుకుందో వారు చెప్పే విధానం చూశాక ధర మార్చ కూడదనే నిర్ణయానికి వచ్చాడు వినోద్‌. 

ఎలా సాధ్యం
వినూ ఇగ్లూ స్పెషాలిటీగా కోన్‌ ఐస్‌క్రీం ధరను రూ.2గానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి మొదలైన తర్వాత ఒక్కసారిగా వినూ స్టోరీ చెన్నై అంతటా పాకిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మీడియా, సోషల్‌ మీడియా ద్వారా వినూ పాపులారిటీ పెరిగిపోయింది. ఓ వైపు ధరలు మండిపోతుంటే రూ.2కే ఐస్‌ క్రీం ఎలా ఇవ్వగలుగుతున్నారంటూ అంతా వినోద్‌ను ప్రశ్నిస్తున్నారు.

సెంటిమెంట్‌
కస్టమర్ల ప్రశ్నలకు వినోద్‌ సమాధానం ఇస్తూ.. పూర్తిగా పాలతోనే ఐస్‌క్రీం తయారు చేస్తాం. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాము. మార్కెట్‌లో ఈ ఐస్‌క్రీం సగటు ధర రూ.20గా ఉంది. కానీ మేము మాత్రం రూ.2కే విక్రయిస్తున్నాం. అయితే ఈ ఐస్‌క్రీం తినేందుకు వచ్చే జనాలు అధిక లాభాలు ఉండే కేకులు, పాలకోవాలు కొనడం ద్వారా నష్టం భర్తీ అవుతుంది. మా నాన్న ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం అనే ఎమోషన్‌ కొనసాగుతుంది అంటూ బదులిచ్చారు. 

చదవండి: నెలకు రూ.3.30 కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి..

మరిన్ని వార్తలు