అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

17 Feb, 2022 15:11 IST|Sakshi

అంతరిక్షంలోకి ప్రయాణించాలనే వారి కోసం అమెరికాకు చెందిన వర్జిన గెలాక్టిక్ అనే సంస్థ టికెట్లను తిరిగి అమ్మడం ప్రారంభించింది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది జూలైలో వర్జిన్ గెలాక్టిక్ పూర్తి సిబ్బందితో అంతరిక్షయానం చేసిన ఆరుగురిలో కంపెనీ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉన్నారు. ఆ అంతరిక్షయానం విజయవంతం కావడంతో ఆసక్తి గల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ టికెట్ ధరను 4.5 లక్షల డాలర్లు(సుమారు రూ. 3.37 కోట్లు)గా నిర్ణయించినట్లు పేర్కొంది. 

టికెట్ కావాలనుకున్న వారు ముందుగా 1.5 లక్షల డాలర్లను డిపాజిట్ చేయాలని.. మిగిలిన మెుత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించవచ్చని వర్జిన్ గెలాక్టిక్ స్పష్టం చేసింది. "ఈ సంవత్సరం చివరి నాటికి 1000 మంది ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు" సీఈఓ మైఖెల్ కాల్ గ్లాజియెర్ అన్నారు. గత ఏడాది నవంబర్ నాటికి కంపెనీ 700 టికెట్స్ విక్రయించినట్లు తెలిపింది. 2004లో స్థాపించబడిన వర్జిన్ గెలాక్టిక్ గత జూలైలో హై ప్రొఫైల్ టెస్ట్ మిషన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. 2022 చివరి నాటికి తన మొదటి చెల్లింపులు చేసిన వినియోగదారులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలి అనేది సంస్థ లక్ష్యం.

అంతరిక్షయానం కోసం టికెట్ బుక్ చేసుకునే టూరిస్టులకు న్యూ మెక్సికో, యూఎస్ఏలోని స్పేస్ పోర్ట్ అమెరికా హోటల్ లో కొన్ని రోజుల పాటు విడిధి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడిధి పర్యటనకు ముందు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మెుదటి స్పెస్ ఫ్లైట్ టూర్ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రయాణం సుమారు 90 నిమిషాలు పాటు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు వెయిట్ లెస్ నెస్ స్థితిని అనుభూతి చెందుతారని వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. ఇప్పటికే వాణిజ్య ప్రయాణీకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థలు స్పేస్ టూరిజం రంగంలో ఒకదాని వెనుక మరొకటి పోటీ పడుతున్నాయి. 

(చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త..!)

మరిన్ని వార్తలు