ఫార్మాకు ‘విటమిన్‌’

15 Sep, 2020 05:39 IST|Sakshi

దేశంలో పెరిగిన విటమిన్ల అమ్మకాలు

మొత్తం ఔషధాల్లో 40 శాతానికి చేరిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 ప్రభావం భారత్‌లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొన్ని మందుల వినియోగం తగ్గితే, మరికొన్నిటి వాడకం పెరిగింది. ప్రధానంగా గ్యాస్ట్రో, న్యూరో, ఆప్తల్మాలజీ, డెంటల్, గైనిక్‌ సంబంధ  ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. వైరస్‌ ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయంతో ఆసుపత్రులకు రోగు లు వెళ్లకపోవడం, చికిత్సలు వాయిదా వేసుకోవడమే ఇందుకు కారణం. కార్డియో, డయాబెటిక్‌ వంటి మందుల అమ్మకాల్లో పెద్దగా మార్పులేదు. కోవిడ్‌ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్‌ తదితర ఔషధాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. విటమిన్ల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి.

విటమిన్లపైనే ఫోకస్‌..
దాదాపు అన్ని ఫార్మా కంపెనీల పోర్ట్‌ఫోలియోలో విటమిన్లు కూడా ఉంటున్నాయి. మొత్తం ఫార్మా విక్రయాల్లో కోవిడ్‌ ముందు వరకు విటమిన్ల వాటా కేవలం 5–10 శాతమే. ఇప్పుడిది 30–40 శాతానికి చేరిందని ఆప్టిమస్‌ ఫార్మా డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘మల్టీ విటమిన్లు, బి, సి, డి, జింక్‌ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో లేనంతగా పెరిగాయి. కంపెనీలు మొదట శానిటైజర్లు, ఆ తర్వాత విటమిన్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. అయితే వీటికి డిమాండ్‌ అధికమవడంతో ధర 20 శాతం దాకా పెరిగింది. ఇతర ఔషధాల అమ్మకాలు తగ్గినా.. కంపెనీలను విటమిన్లు ఆదుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, కోవిడ్‌ కారణంగా ఫార్మా రంగంలో ఉద్యోగుల తీసివేతలు జరగలేదని, కొత్త నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు.

రెండేళ్లలో రూ.1,000 కోట్లు..
యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, జనరిక్స్, ఇంజెక్టేబుల్స్‌ తయారీలో భారత్‌లో తొలి స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో సుమారు 1,500 దాకా కంపెనీలు ఉన్నాయి. 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఎగుమతి మార్కెట్లతోపాటు దేశీయంగా ఔషధాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఒకట్రెండేళ్లలో 25 దాకా కంపెనీల నుంచి కొత్త యూనిట్లు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మిగిలిన కంపెనీలు అన్నీ ఇప్పటికే ఉన్న ప్లాంట్లలో విస్తరణకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ కంపెనీలు రెండేళ్లలో రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి చేసే అవకాశం ఉంది. తద్వారా కొత్తగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బద్దిలో ప్లాంట్లను నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు తదుపరి విస్తరణ హైదరాబాద్‌లో చేపట్టనున్నాయని ఫ్యూజన్‌ హెల్త్‌కేర్‌ ఎండీ మధు రామడుగు తెలిపారు. భాగ్యనగరి సమీపంలో ప్రతిపాదిత ఫార్మా సిటీ సాకారం అయితే పెద్ద ఎత్తున కొత్త ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు.

ఏపీలోనూ కంపెనీల విస్తరణ
ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్లలో విస్తరణ కోసం ఎదురుచూస్తున్నాయని బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఈడీ ఈశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. అయితే పరిమితులు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని అన్నారు. ‘ఫార్మా సిటీ సాకారమయ్యే వరకు వీటి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. చాలా ప్లాంట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఉన్నవే. కొత్తగా ఎఫ్‌డీఏ నుంచి అనుమతి తీసుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లలో ఒకటి తెలంగాణలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండేళ్లలో 50–60 యూనిట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఈ ఏడాది 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది’ అని వివరించారు. ఎగుమతులతో కలుపుకుని భారత ఫార్మా మార్కెట్‌ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా