ఎయిర్‌టెల్, జియోను అధిగమించిన వోడాఫోన్ ఐడియా

8 Dec, 2020 19:00 IST|Sakshi

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్‌ ను వోడాఫోన్ ఐడియా పొందింది. సర్వీసు ప్రొవైడర్లలో వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే ఐడియా అగ్రస్థానంలో నిలిచినట్లు డేటా చూపిస్తుంది. ఇటీవల రీబ్రాండ్ చేసిన వోడాఫోన్ ఐడియా ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో నెట్ వర్క్ లను అధిగమించింది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 5కి 4.9 రేటింగ్‌తో ఐడియా అగ్రస్థానంలో ఉంది. వొడాఫోన్ 4.6/5, బిఎస్‌ఎన్‌ఎల్ 4.1/5 రేటింగ్ తో తర్వాత స్థానంలో ఉన్నాయి. ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ 3.8/5 రేటింగ్‌తో వెనుకబడి ఉన్నాయి. (చదవండి: ఆ కాల్స్‌తో జర జాగ్రత్త!)

కాల్ నాణ్యత విషయంలో 88.4 శాతం మంది వినియోగదారులు సంతృప్తి చెందారు. 8.24 శాతం మంది కాల్ నాణ్యత విషయంలో సంతృప్తిగా లేరు. అలాగే 3.62 శాతం మంది కాల్స్ డ్రాప్‌ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇండోర్,  అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా ఐడియా 4.9/5, 4.8/5 రేటింగును పొందింది. అలాగే ఇండోర్, అవుట్ డోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6/5, 4.3/5, ఎయిర్‌టెల్ 3.9, 3.5, బిఎస్‌ఎన్‌ఎల్ 3.9 మరియు 4.3, జియో 3.9, 3.6 రేటింగులు లభించాయి. అక్టోబర్ నెలలో కాల్ నాణ్యత పరంగా బిఎస్ఎన్ఎల్ 3.7 రేటింగ్ పొందింది. దీని తరువాత ఎయిర్‌టెల్ 3.5, ఐడియా 3.3, జియో 3.2, వోడాఫోన్ 3.1 రేటింగ్ ను పొందింది. 

>
మరిన్ని వార్తలు