వొడాఫోన్‌ ఐడియా కొత్త బ్రాండ్‌ వీఐ

7 Sep, 2020 12:36 IST|Sakshi

వీఐ పేరుతో యూనిఫైడ్‌ బ్రాండ్‌ విడుదల 

కొత్త లోగోను సైతం ఆవిష్కరించిన కంపెనీ

ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోకు పోటీగా డిజిటల్‌ సేవలు

5 శాతం పెరిగిన వొడాఫోన్‌ ఐడియా షేరు

మొబైల్‌ సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ఎట్టకేలకు ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా పావులు కదిపింది. వీఐ పేరుతో కొత్త వైర్‌లెస్‌ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్‌ సేవలలో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్‌ ప్రకటించడం గమనార్హం!  ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారాంతాన వొడాఫోన్‌ ఐడియా బోర్డు రూ. 25,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. విభిన్న మార్గాలలో దశలవారీగా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించింది. కంపెనీ సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

భారీ స్పెక్ట్రమ్
వొడాఫోన్‌ ఐడియా.. భారీగా 1846 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 4జీ సర్వీసులను అందించడం ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. గత రెండేళ్లుగా వొడాఫోన్‌, ఐడియా బ్రాండ్లను విడిగా నిర్వహిస్తూ వచ్చింది. ఇటీవల కస్టమర్లను కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో యూనిఫైడ్‌ బ్రాండుగా వీఐను తీసుకువచ్చింది. తద్వారా మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోగలమని కంపెనీ ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఐడియా బ్రాండుకు పట్టుంటే.. పట్టణాలలో వొడాఫోన్‌ అధికంగా విస్తరించింది. రెండు కంపెనీల విలీన సమయంలో 40.8 కోట్లుగా ఉన్న కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చి తాజాగా 28 కోట్లకు చేరింది. 
 
షేరు జూమ్
కొత్త యూనిఫైడ్‌ బ్రాండుతోపాటు.. లోగో ఆవిష్కరణ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు నేటి ట్రేడింగ్‌లో ఉదయం నుంచీ డిమాండ్‌ కనిపిస్తోంది. తొలుత ఒక దశలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 13.25ను తాకింది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 12.7 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా