వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!

23 Aug, 2021 19:25 IST|Sakshi

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఉంది వొడాఫోన్ ఐడియా పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా జూన్ 2021లో దాదాపు 43 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన తాజా టెలికామ్ చందాదారుల డేటా ప్రకారం.. రిలయన్స్ జియో ఈ నెలలో 54 లక్షల మందికి పైగా వినియోగదారులను చేర్చుకుంది. వొడాఫోన్ ఐడియా మేలో 40 లక్షలకు పైగా చందాదారులను కోల్పోతే జూన్ నెలలో 42,89,159 మంది వినియోగదారులను కోల్పోయింది. దీంతో వొడాఫోన్ ఐడియా మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 27.3 కోట్ల‌కు ప‌డిపోయింది.

రిలయన్స్ జియో జూన్ నెలలో 54,66,556 వినియోగదారులను ఆన్ బోర్డు చేసుకుంది. మేలో ఈ సంఖ్య 35.54 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రిల‌య‌న్స్ జియో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 43.6 కోట్ల‌కు చేరింది. అలాగే, భారతి ఎయిర్‌టెల్‌ 38,12,530 చందాదారులను జోడించుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్య 35.2 కోట్లుగా ఉన్నారు. దేశం మొత్తం మీద టెలిఫోన్ చందాదారుల సంఖ్య జూన్ 2021 చివరినాటికి 120.2 కోట్లకు చేరుకుంది. గత నెలతో పోలిస్తే నెలవారీ వృద్ధి రేటు 0.34 శాతం. పట్టణ టెలిఫోన్ సబ్ స్క్రిప్షన్ పెరిగితే, కానీ గ్రామీణ సబ్ స్క్రిప్షన్ జూన్‌లో స్వల్పంగా తగ్గింది.(చదవండి: ఆస్తుల విక్రయానికి రోడ్‌మ్యాప్‌ విడుదల చేసిన కేంద్రం)

ఇక మొత్తం బ్రాడ్ బ్యాండ్ చందాదారులలో ఐదు సర్వీస్ ప్రొవైడర్లు జూన్ చివరిలో 98.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు. "ఈ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 439.91 మిలియన్లు, భారతి ఎయిర్ టెల్ 197.10 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 121.42 మిలియన్లు, బిఎస్ఎన్ఎల్ 22.69 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్ 1.91 మిలియన్ల చందాదారులను" కలిగి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు