వొడాఫోన్‌ ఐడియాకు భారీ నిధులు!

19 Nov, 2020 14:58 IST|Sakshi

ఓక్‌ట్రీ, వార్డే పార్టనర్స్‌ ఆసక్తి?

2-2.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

నిధుల సమీకరణ సన్నాహాల్లో వొడాఫోన్‌ ఐడియా

3.4 బిలియన్‌ డాలర్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన కంపెనీ

ముంబై: దేశీ మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో భారీ పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓక్‌ట్రీ క్యాపిటల్‌ అధ్యక్షతన ఏర్పడిన కన్సార్షియం 2-2.5 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసే వీలున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. తద్వారా వొడాఫోన్‌ ఐడియాలో కొంత వాటాను సొంతం చేసుకునే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వొడాఫోన్‌ ఐడియా 3.4 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 25,000 కోట్లు)ను సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. షేర్ల విక్రయం, రుణ సమీకరణ ద్వారా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు వేసినట్లు తెలియజేసింది. దీంతో ఓక్‌ట్రీ క్యాపిటల్‌ పెట్టుబడుల వార్తలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్‌)

పోటీ తీవ్రం..
కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ భారీస్థాయిలో కస్టమర్లను పొందుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు కంపెనీలూ వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లను సైతం ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీ మొబైల్‌ టెలికం రంగంలో పెరిగిన తీవ్ర పోటీ, నిధుల ఆవశ్యకత నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా పెట్టుబడుల సమీకరణ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా తిరిగి మార్కెట్‌ వాటాను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా లాభదాయకతను సైతం పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో డిసెంబర్‌ చివరికల్లా 20 శాతంవరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు వివరించాయి. 

మరిన్ని వార్తలు