దేశీ ట్యాక్స్‌లపై గళం విప్పుతున్న విదేశీ కార్‌ మేకర్స్‌

11 Aug, 2021 10:59 IST|Sakshi

దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్‌లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌లు వాటికి వంత పాడాయి.

పన్ను తగ్గించండి
కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్‌ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్‌వ్యాగన్‌ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్‌లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్‌ వ్యాగన్‌ కోరింది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా హెడ్‌ గుర్‌ప్రతాప్‌ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్‌ ఆటోమోబైల్‌ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్‌ వార్త సంస్థతో అన్నారు. 

మినహాయింపు వస్తే
ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మార్కెట్‌లో నంబర్‌ వన్‌ స్థానం కోసం ఫోక్స్‌ వ్యాగన్‌ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే  ఆడీ ఈ ట్రాన్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కారుని ఇండియాలో లాంఛ్‌ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్‌వ్యాగన్‌, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్‌ ప్రయత్నాలు చేస్తోంది. 

క్లారిటీ లేదు
ఫారిన్‌ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ విషయంలో టెస్లా, హ్యుందాయ్‌, బెంజ్‌, ఫోక్స్‌వ్యాగన్‌ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్‌ పెట​​​‍్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. 

స్వదేశీపై ప్రభావం
ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్‌ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక​‍్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. 

మరిన్ని వార్తలు