అటు ఓలా స్కూటర్‌... ఇటు ఓల్ట్రో సైకిల్‌...

7 Aug, 2021 21:01 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్‌లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే  స్కూటర్‌ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్‌లో ఓల్ట్రో దూసుకొస్తోంది. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్‌ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్‌ ఓల్ట్రో.

ఓల్ట్రో
ఓల్ట్రో స్టార్టప్‌ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్‌ నుంచి ఓల్ట్రాన్‌ పేరుతో ఇ సైకిల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్‌ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ని డిజైన్‌ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా మార్కెట్‌లోకి వస్తోంది.  

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ
ఓల్ట్రో సైకిల్‌లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే సగటున ఒక యూనిట్‌ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్‌ ఛార్జ్‌ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్‌ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్‌ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ‍్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు.

ధర ఎంతంటే
ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్‌పై వన్‌ ఇయర్‌ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్‌గడ్‌లో ఈ సంస్థకు సైకిల్‌ తయారీ యూనిట్‌ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది.

వారంటీ
సైకిల్‌కి సంబంధించిన కంట్రోలర్‌, మోటార్‌లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్‌నే రీప్లేస్‌ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్‌ రిపేర్‌ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్‌ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు