విశాఖ స్టీల్‌ప్లాంట్‌ టర్నోవర్‌ రూ. 28,008 కోట్లు

2 Apr, 2022 06:09 IST|Sakshi

ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2021–22లో ఉత్పత్తి, అమ్మకాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డులతో హోరెత్తిచ్చిందని కంపెనీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ జీఎం బీఎస్‌ సత్యేంద్ర  తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 5.773 మిలియన్‌ టన్నుల హాట్‌మెటల్, 5.272 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ స్టీల్, 5.138 మిలియన్‌ టన్నుల సేలబుల్‌ స్టీల్‌ ఉత్పత్తిని చేయడం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమైన ప్రగతి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కోకింగ్‌ బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికి స్టీల్‌ప్లాంట్‌ రూ. 28,008 కోట్లు టర్నోవర్‌ సాధించి ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ విక్రయ పనితీరును నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలం సాధించిన విక్రయాలు రూ. 17,956 కోట్లు   కంటే 56 శాతం ఎక్కువ కావడం విశేషం.

ఇక ఉత్పత్తిలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే .. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో మొదటసారిగా పల్వరైజ్డ్‌ కోల్‌ ఇంజక్షన్‌ సరాసరి టన్ను హాట్‌మెటల్‌కు  100 కేజీలు సాధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఆరు రోలింగ్‌ మిల్లులో 22 కొత్త హై ఎండ్‌ నవీన ఉత్పత్తులు అభివృద్ధి చేశారు. సంస్థ ఉత్పత్తులు, ఎగుమతుల విక్రయాలు రూ. 5,607 కోట్లు  చేయడం ద్వారా  గత ఏడాది కంటే 37 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు సత్యేంద్ర పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో రూ. 3501 కోట్లు అమ్మకాలు చేయడం ద్వార గత ఏడాది ఇదే వ్యవధి కంటే 6 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.  గత ఏడాదిలో స్టీల్‌ప్లాంట్‌కు సీఐఐ గోద్రేజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు అందజేసింది. ఉత్తమ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్‌ ఎల్‌డీ గ్యాస్‌ హోల్డర్‌ ఇంటర్‌ కనెక్షన్‌ కోసం ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌ భట్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల నిబద్ధత,  పనితీరును అభినందించారు.

మరిన్ని వార్తలు