వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌- కేపీఐటీ.. అదుర్స్‌

4 Aug, 2020 12:04 IST|Sakshi

11శాతం దూసుకెళ్లిన వీఎస్‌టీ షేరు

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన కేపీఐటీ

క్యూ1 ఫలితాల విడుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పొగాకు ఉత్పత్తుల దిగ్గజం వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఐటీ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు కాలంలోనూ ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ నామమాత్ర వృద్ధితో దాదాపు రూ. 76 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు మాత్రం 19 శాతం క్షీణించి రూ. 245 కోట్లకు పరిమితమయ్యాయి. లాక్‌డవున్‌ నేపథ్యంలో సప్లై చైన్‌ అవాంతరాలు, వినియోగ డిమాండ్‌ నీరసించడం వంటి అంశాలు పనితీరును ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం తయారీ కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ అమ్మకాలపై కోవిడ్‌-19 ప్రభావం ఉండవచ్చని భావిస్తోంది. కాగా.. ఎన్‌ఎస్‌ఈలో తొలుత వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ షేరు  13 శాతం దూసుకెళ్లింది. రూ. 3,650కు చేరింది. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 3,500 వద్ద ట్రేడవుతోంది. 

కేపీఐటీ టెక్నాలజీస్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కేపీఐటీ టెక్నాలజీస్‌ నికర లాభం 36 శాతంపైగా క్షీణించింది. రూ. 24 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం వెనకడుగుతో రూ. 493 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 1.2 శాతం తక్కువగా 13.4 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 432 కోట్లను తాకినట్లు కేపీఐటీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఐటీ షేరు ఎన్ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 68 సమీపంలో ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు