జాబ్‌కు రిజైన్‌ చేస్తున్నారా? ఆ పని మాత్రం చేయకండి! ఎందుకంటే?

13 Nov, 2022 12:49 IST|Sakshi

ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్‌ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవితం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. నచ్చిన ఉద్యోగం. కావాల్సినంత జీతం. ఇంతకంటే ఏం కావాలి’ అంటూ చేస్తున్న ఉద్యోగాలకు ఉన్న పళంగా రాజీనామాలు (ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌) చేసి కొత్త ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఫలితం? ఉద్యోగులు ఊహించింది వేరు. అక్కడ జరుగుతుంది వేరంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

బ్యూరో ఆఫ్‌ లేబర్‌ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెరికాకు చెందిన 4.7 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారు. మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్‌ పేజ్‌ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్‌ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట!

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

అయితే తాజాగా ఉద్యోగుల రిజైన్‌లపై ఇండీడ్‌ హైరింగ్‌ ల్యాబ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నిక్‌ బంక్ స్పందించారు. నచ్చిన పనిగంటలు, ఎక్కువ జీతం కోసం ఆశపడి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలిపారు. ఎందుకంటే? ఈ ఏడాది జులైలో రిజైన్‌ చేసి వేరే సంస్థలో చేరిన ఉద్యోగి జీతం వృద్ధి 8.5శాతంగా ఉంది. కానీ మూడు నెలలు తిరక్కుండా ఉద్యోగుల శాలరీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. ఆగస్ట్‌లో శాలరీ వృద్ధి రేటు ఆగస్ట్‌లో 8.4శాతం, సెప్టెంబర్‌లో 7.9శాతం, అక్టోబర్‌లో 7.6శాతం, నవంబర్‌లో 6.4శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తొందరపడకండి
మరోవైపు గ్లాస్‌డోర్‌ ఎకనమిస్ట్‌ డేనియల్‌ జావో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌ అంశం ముగియలేదు. జాబ్‌ మార్కెట్‌లో ఉద్యోగాల రాజీనామా సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ఆర్ధిక మాద్యం ముప్పు కారణంగా తగ్గే అవకాశం ఉంది. ఇక జాబ్‌ మారే ఉద్యోగులు ఇంతకు ముందులా..మాకు ఇంత శాలరీ కావాలని డిమాండ్‌ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అన్నారు. 

వచ్చే ఏడాది
వచ్చే ఏడాది ఉద్యోగులపై ఆర్ధిక మాంద్యం ప్రభావం తక్కువే. అయినప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారు. లేదంటే ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి 2023 కొంచెం గడ్డు కాలమని అని అన్నారు. జాబ్‌ సెక్యూరిటీ, జీతాల నెగోషియేషన్‌లు ఉద్యోగికి సంతృప్తిని ఇవ్వకపోవచ్చని తెలిపారు.

చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్‌ సంస్థను అమ్మేయండి’!

మరిన్ని వార్తలు